ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కి సంబంధించి ఇనుప తవ్వకాలపై తమకు ఎటువంటి అభ్యంతరాలూ లేవని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సుప్రీంకు చెప్పింది. అయితే ఇప్పటికే గనుల తవ్వకాల్లో అక్రమాలు జరిగాయి అని, తాజాగా ఎటువంటి అనుమతులు ఇచ్చినా అవి పునరావృతం అవుతాయని సుప్రీంలో అమికస్ క్యూరి ఓ వాదన వినిపించారు. దీంతో ఆంధ్రా, కర్ణాటక సరిహద్దుల్లో ఇనుప ఖనిజం తవ్వకంపై మళ్లీ వివాదాలే రేగుతున్నాయి.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సన్నిహితంగా వ్యవహరించే గాలి జనార్దన రెడ్డి నేతృత్వంలో నడుస్తున్న ఈ కంపెనీపై పలు అభియోగాలు ఉన్నాయి. దీంతో సుప్రీంలో అమికస్ క్యూరి ఓ నివేదిక ఇచ్చారు. దీని ప్రకారం ఇప్పటికే ఆరు మైనింగ్ లీజుల్లో అక్రమాలు జరిగాయని తేలింది. ఇప్పుడు ఈ నివేదిక పరిశీలించి, తాజాగా కోర్టు ఏం చెప్పనుంది అన్నది తేలనుంది. ఇందులో ఆ రోజు అనుమతులు పొందిన ప్రతి కంపెనీ కూడా నిబంధనలకు తిలోదకాలు ఇచ్చిందనే పేర్కొని ఉంది.
ఆ విధంగా జగన్ కు అనుబంధంగా ఉన్న కంపెనీలు అన్నీ ఆ తరువాత మైనింగ్ ప్రాసెస్ ను నిలిపివేశాయి. తాజాగా సుప్రీంలో మైనింగ్ తవ్వకాలపై మళ్లీ కదలిక వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ సాగించిన కంపెనీలపై ఇప్పటిదాకా ఎటువంటి చట్టపరమైన చర్యలు కూడా లేవని తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారం కోల్పోయాక, వైఎస్సార్ మరణం తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సంబంధిత కంపెనీలు లాబీయింగ్ నడపలేకపోయాయి అన్న వాదన కూడా ఉంది.
ఇవన్నీ ఇప్పుడు ఓబుళాపురం మైనింగ్ కేసును మరింత ప్రభావితం చేయనున్నాయి. 2010లో ఆగిపోయిన మైనింగ్ దాదాపు పన్నెండేళ్ల తరువాత మళ్లీ మొదలు అయ్యేందుకు చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. అయితే ఈ కేసును మరో ధర్మాసనంకు అప్పగించారు సీజే ఎన్వీ రమణ. కోర్టు చెప్పే నిర్ణయాలను దృష్టిలో ఉంచుకునే మళ్లీ మైనింగ్ ప్రాసెస్ ను సంబంధిత వ్యక్తులు లేదా కంపెనీలు మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.
Comments 1