ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని అమరావతి అంటూ ఏపీ హైకోర్టు గతంలో తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక, అదే సమయంలో అమరావతి రాజధానిపై అమరావతి రైతులు కూడా సుప్రీంకోర్టు గడప తొక్కారు. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ లో తమను కూడా ఇంప్లీడ్ చేసుకోవాలంటూ అమరావతి రైతులు దేశపు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
వారితోపాటు కొందరు వ్యక్తులు కూడా ఈ వ్యవహారంపై సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేయడం సంచలనం రేపుతోంది. అయితే, ఈ పిటిషన్లు అన్నింటిని కలిపి ఒకేసారి విచారణ చేపడతామని గతంలో సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో శుక్రవారంనాడు ఆ పిటిషన్ల విచారణ జరగనుందని టాక్ వచ్చింది. కానీ, అనూహ్యంగా ఆ పిటిషన్ లపై విచారణను ఈ నెల 14కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వాస్తవానికి అమరావతి పిటిషన్లపై విచారణ నవంబర్ 1న సుప్రీంకోర్టులో జరగాల్సి ఉంది.
కానీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు. లలిత్ ఈ పిటిషన్లపై విచారణ నుంచి వైదొలగడం షాకింగ్ గా మారింది. నాట్ బిఫోర్ మీ అంటూ ఈ విచారణ నుంచి సిజెఐ లలిత్ తప్పుకోవడం సంచలనం రేపింది. ఈ పిటిషన్ మరో బెంచ్ కు బదిలీ చేయాలని, ఈ నెల 4న ఆ పిటిషన్లపై విచారణ చేపట్టాలని సిజెఐ లలిత్ నవంబర్ 1న ఆదేశాలు జారీ చేశారు. గతంలో, సీఎం జగన్ కేసులను వాదించిన నేపథ్యంలో సీజేఐ లలిత్ ఈ పిటిషన్లపై విచారణ జరిపేందుకు విముఖత వ్యక్తం చేశారు. తాజాగా ఈ పిటిషన్లపై విచారణ మరో పది రోజులు వాయిదా పడడంతో అమరావతి రైతులకు సుప్రీంలో నిరాశ ఎదురైనట్లయింది.