అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు కలిగే షాక్ అలా ఇలా ఉండదు. అందులోనూ స్టార్ సెలబ్రిటీ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్న వారికి.. ఆ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయ్యేలాంటి ఉదంతాలతో వచ్చే కష్టం అంతా ఇంతా కాదు.
తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి శిల్పా శెట్టికి అలాంటి పరిస్థితే ఎదురైంది. బూతు సినిమాల్ని తీస్తున్నారంటూ తన భర్త రాజ్ కుంద్రాను అరెస్టు చేసిన వైనం ఆమెకు షాకింగ్ గానే మారింది. ముంబయి పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్టు చేసిన నాలుగు రోజుల వరకు కామ్ గా ఉన్న ఆమె.. తాజాగా ఈ ఉదంతంపై తొలిసారి స్పందించారు.
ఇప్పటికే ఈ బూతు సినిమాల వ్యవహారంలో రాజ్ కుంద్రాకే కానీ.. అతని సతీమణి శిల్పాకు సంబంధం లేదన్న విషయాన్ని దాదాపుగా తేల్చారు. ఇదిలా ఉంటే.. రాజ్ కుంద్రా అరెస్టు తర్వాత పలువురు నటీమణులు అతడిపై షాకింగ్ వ్యాఖ్యలు చేస్తున్నారు.
అతగాడితో తమకు ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయన్న విషయాన్ని చెప్పుకు రావటానికి మించిన కష్టం ఏ భార్యకైనా ఏముంటుంది? రాజ్ కుంద్రాకు సెకండ్ మ్యారేజ్ అయిన శిల్పా.. ఇప్పటికే పలుసార్లు రాజ్ కారణంగా ఇబ్బందులకు గురయ్యారు. సమస్యల్లో చిక్కుకున్నారు.
తాజాగా పోర్న్ మూవీస్ ప్రొడక్షన్ కేసు బయటకు వచ్చిన తర్వాత.. తొలిసారి స్పందించిన శిల్పా.. తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ప్రముఖ రచయిత జేమ్స్ థర్బర్ నావెల్ లోని ఒక పేరాను ఇందులో హైలెట్ చేసి.. తాజాగా తన మానసిక పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.
తీవ్రమైన ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న ఆమె తన ఎమోషన్ కు సొంత మాటల కంటే.. అద్దె మాటలే బెటరన్నట్లుగా ఆమె తీరు ఉందని చెప్పాలి.
ఇంతకూ ఆమె పెట్టిన పోస్టులో ఏమున్నదంటే.. ‘‘మమ్మల్ని బాధపెట్టిన వ్యక్తులపై.. మేము అనుభవించిన చిరాకు.. దురదృష్టం పై మేము తిరిగి కోపాన్ని చూస్తాము. మేము మా ఉద్యోగాలను కోల్పోవచ్చు. వ్యాధి బారిన పడవచ్చు. ప్రియమైన వ్యక్తి మరణాన్ని చూడవచ్చనే భయంతో ఉంటున్నాము. అయినప్పటికి మనం ఉండాల్సిన ప్లేస్ ఇదే. ప్రస్తుతం జరిగింది ఏదైనా కావొచ్చు.. కానీ జరుగుతున్నది పూర్తిగా తెలుసు. నేనిప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నాను. ఇంకా బతికి ఉన్నది అదృష్టం. గతంలో సవాళ్లకు తట్టుకున్నా. భవిష్యత్తులో వచ్చే సవాళ్లను తట్టుకుంటాను. ఈ రోజు నా జీవితాన్ని గడపటానికి నన్ను ఏదీ మార్చాల్సిన అవసరం లేదు’’ అన్న భావం వచ్చే కోట్ ను పోస్టు చేశారు.
తన జీవితంలో తనకు ఇప్పటివరకు ఎదురైన సవాళ్లను ఎదుర్కొన్నట్లే.. తాజా సవాలును తాను ఎదుర్కొంటానన్న విశ్వాసాన్ని ప్రదర్శించటంతో పాటు.. తానిప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు శిల్పా.