- అప్పులు తేవడానికి రెండు ప్రత్యేక కార్పొరేషన్లు
- ప్రభుత్వ ఆస్తులు వాటికి బదలాయింపు
- రాజ్యాంగ విరుద్ధమని తేల్చిన కేంద్రం
- రుణాలిచ్చిన బ్యాంకులు బెంబేలు
అవినీతి ద్వారా సంపాదించిన సొమ్మును.. దేశవిదేశాల్లో బినామీ పేర్లతో పెట్టిన షెల్ కంపెనీలకు మళ్లిస్తున్న అక్రమార్కులను మనం చూస్తున్నాం.. వారి గురించి వింటున్నాం. నవ్యాంధ్ర సీఎం జగన్మోహన్రెడ్డిపైనా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. అది వేరే విషయం.. ఇప్పుడు ఆయన ఏలుబడిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రెండు ‘షెల్’ కార్పొరేషన్లను.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి సంస్థ (ఏపీఎస్డీసీ), రాష్ట్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్లను ఏర్పాటుచేసింది.
తన కళ్లుగప్పి.. పరిమితికి మించి తీసుకొస్తున్న అప్పులను వీటి మాటున దాచిన వైనం చూసి కేంద్రప్రభుత్వమే బిత్తరపోయింది. స్వాతంత్ర్యానంతర భారతంలో ఇలాంటి రాజ్యాంగ విరుద్ధ చర్య కనీవినీ ఎరుగమని ఆర్థిక నిపుణులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.
ప్రభుత్వ ఆస్తులను ఏపీఎస్డీసీకి మళ్లించి.. వాటిని కుదువపెట్టి.. అక్రమ మార్గాల్లో బ్యాంకుల నుంచి రూ.25 వేల కోట్ల మేర జగన్ ప్రభుత్వం రుణం తీసుకొచ్చింది. దీనిపై కేంద్రం కొరడా ఝళిపించింది. దీని ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యకలాపాలు పూర్తి రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. ఈ ఉల్లంఘనలకు ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని, దీనికి జవాబివ్వాలని రాష్ట్రానికి లేఖాస్త్రం సంధించింది.
రాష్ట్ర ఖజానాకు రావలసిన భవిష్యత పన్ను ఆదాయాన్ని అప్పుల కోసం ఎస్డీసీకి ఎస్ర్కో చేయడం రాజ్యాంగంలోని 266(1)వ అఽధికరణకు విరుద్ధమని తేల్చిచెప్పింది. ఆ కార్పొరేషన్ నుంచి రూ.18,500 కోట్ల రుణం తీసుకురావడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఎస్డీసీ అక్రమ వ్యవహారాలు కేంద్రం దృష్టికి చేరేనాటికి రూ.18,500 కోట్ల రుణమే తెచ్చినప్పటికీ.. తాజాగా ప్రభుత్వం మరో రూ.3,000 కోట్ల అప్పు తెచ్చింది. దీంతో ఆ కార్పొరేషన్ నుంచి అక్రమంగా తెచ్చిన మొత్తం రుణం రూ.21,500 కోట్లకు చేరుకుంది.
ఇంకో రూ.3,500 కోట్లు తేవడానికి బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం లేఖ రాయడంతో రుణాలిచ్చిన, ఇవ్వదలచిన బ్యాంకులు ముఖం చాటేశాయి. ఎస్డీసీ ద్వారా రుణాలు తెచ్చుకునేందుకు జగన్ ప్రభుత్వం విశాఖ జిల్లా కలెక్టరేట్, తహశీల్దార్ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ ఆస్తులను సదరు కార్పొరేషన్ పేరిట బదిలీ చేసి వాటిని బ్యాంకులకు తాకట్టు పెట్టింది.
ద్రవ్య నియంత్రణ-బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) చట్టాన్ని జగన్ ప్రభుత్వం గత రెండేళ్లుగా ఉల్లంఘిస్తోంది. కార్పొరేషన్లకు ఎడాపెడా గ్యారెంటీలు ఇస్తూ వేల కోట్ల రుణాలు తెస్తూ.. వాటిని ఎఫ్ఆర్బీఎం పరిధిలో చూపకుండా కేంద్రం, ఆర్బీఐల కళ్లకు గంతలు కడుతోంది.
అయితే, ఇటీవలే ఈ ఎఫ్ఆర్బీఎం ఉల్లంఘనలను కేంద్రం కూడా గుర్తించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇచ్చిన అప్పుల పరిమితిలో రూ.18 వేల కోట్లకు కోత విధించిన సంగతి తెలిసిందే. ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి రూ.లక్ష కోట్లకు పైగా అప్పులు చేయడం, లెక్కా పత్రం లేకుండా ఎడాపెడా గ్యారెంటీలు ఇచ్చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తాజా లేఖలో పేర్కొంది.
అయినా మరో కార్పొరేషన్..
కేంద్రం కన్నెర్ర చేసినా జగన్ సర్కారు బుద్ధి మార్చుకోలేదు. ఎస్డీసీ గుట్టు రట్టవడంతో అప్పులు తేవడానికి మరో కంపెనీని తెరపైకి తెచ్చింది. డిపాజిట్లు స్వీకరించకూడని సంస్థగా ‘ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్’ పేరుతో ఆర్బీఐ వద్ద రిజిస్టర్ చేసి.. ప్రభుత్వ కార్పొరేషన్లు, విద్యాసంస్థల నుంచి ఏకంగా రూ.3 వేల కోట్ల డిపాజిట్లు స్వీకరించింది.
గడచిన నెల రోజుల్లో రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలు, బోర్డులు, యూనివర్సిటీలు, కొన్ని కార్పొరేషన్ల నుంచి 5 శాతం వడ్డీకి రూ.3,000 కోట్ల డిపాజిట్లను సేకరించింది. నిజానికి ఇవన్నీ అత్యవసర నిధులు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వివిధ పనులకు ఉద్దేశించిన గ్రాంట్లు వీటిలో ఉన్నాయి.
ఈ నిధులను ఆయా ఖాతాల నుంచి మొదట ఆ కంపెనీకి.. అక్కడి నుంచి రాష్ట్ర ఖజానాకు మళ్లించారు. అలా ఖజానాలో చేరిన నిధులను ప్రభుత్వం తన అవసరాలకు వాడుకుంటోంది. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్లో డబ్బులు డిపాజిట్ చేయండి.. 5 శాతం వడ్డీ ఇస్తామంటూ కార్పొరేషన్లకు, విద్యాసంస్థలకు పంపిన లేఖపై ఉన్న ఓ ప్రైవేటు కన్సల్టెంటు సంతకం ఉండడం విశేషం.
5 శాతం వడ్డీకి వేల కోట్ల అప్పు తీసుకుంటున్న లేఖపై ఐఏఎస్ అధికారులు సంతకం పెట్టకపోవడం మరో విచిత్రం. ఇది అక్రమం కాబట్టి.. విషయం బయటకు వస్తే ఇరుక్కుపోతామన్న ఉద్దేశంతోనే వారు పెట్టలేదని తెలుస్తోంది.