ఏడాదికిపైగా రాష్ట్రంలోని 90 నియోజకవర్గాల్లో దాదాపు 4000 కిలోమీటర్ల మేర నడిచేలా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ప్రారంభించిన పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో పాదయాత్రను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు షర్మిల ప్రకటించారు. ఆమె అడుగులు ఆగినప్పటికీ అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాత్రం పోరుబాట కొనసాగించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చివరి ధాన్యం గింజ వరకూ కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో ఆమె హైదరాబాద్‌లో 72 గంటల పాటు నిరహార దీక్ష చేయనున్నారు. ఈ నెల 12న అంటే శుక్రవారం ఈ దీక్ష మొదలెట్టనున్నారు.
రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా తెలంగాణలో జులై 8న తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరుతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని షర్మిల స్థాపించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అధికార పార్టీ వైఫల్యాలపై ఆమె మాటలు ఎక్కుబెట్టారు. కేసీఆర్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నిరుద్యోగ సమస్యను భుజాలకెత్తుకుని దాని కోసం పోరాటం చేస్తూ ప్రతి మంగళవారం నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఇక అక్టోబర్ 20న ప్రజా ప్రస్థానం పేరుతో మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 21 రోజుల పాటు ఆరు శాసన సభ నియోజకవర్గాల పరిధిలోని 150 గ్రామాల్లో ఆమె పాదయాత్ర చేశారు. కానీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి రావడంతో దాన్ని గౌరవిస్తూ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఎక్కడైతే పాదయాత్ర ఆపారో తిరిగి అక్కడి నుంచే మొదలెట్టనున్నారు.
పాదయాత్ర ఆపినప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకంగా ఆమె రైతు వేదన పేరిట 72 గంటల పాటు నిరహార దీక్ష చేయనున్నారు. వడ్ల కొనుగోలు విషయంలో ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం.. అటు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు రైతులతో చెలగాటమాడుతున్నాయని ఆమె విమర్శించారు. ఆ వడ్లను కొనే బాధ్యత నుంచి తప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం పెత్తనం ఏమిటనీ గతంలో ప్రశ్నించడంతో పాటు ధాన్యం మొత్తాన్ని తామే కొంటామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాట మార్చి రైతులను బలి తీసుకుంటున్నారని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకు రైతుల పక్షాన పోరాడేందుకు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు నిర్ణయించుకున్నారని తెలిసింది. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ఈ విషయంలో రైతుల కోసం పోరాడటం ద్వారా తన పార్టీకి మైలేజీ వస్తుందని ఆమె భావిస్తున్నట్లు సమాచారం.