దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పొలిటికల్ కెరీర్ క్రాస్ రోడ్స్‌లో పడిపోయిందని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఒకరకమైన గందరగోళ స్థితికి చేరిపోయిందని కామెంట్ చేస్తున్నారు. దీనికంతటికీ కారణం ఇటీవలి కాలంలో షర్మిల వేసిన అడుగులు, తాజాగా కాంగ్రెస్ పార్టీ అత్యున్నత సమావేశాల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలు అని ఉదహరిస్తున్నారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించి తెలంగాణ రాజకీయాల్లో తన ముద్ర వేసుకోవాలని భావించిన వైఎస్ షర్మిల ఈ మేరకు వివిధ కార్యక్రమాలతో తనవంతు కృషి చేశారు. అయితే, అనంతరం చోటుచేసుకున్న పరిణామాల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఆ పార్టీ పెద్దలతో చర్చలు జరిపారు. వైఎస్ఆర్టీపీ విలీనం లేదా పొత్తు, ఆ పార్టీలో చేరి పదవి పొందడం అనే అంశాలతో షర్మిల పేరు వార్తల్లోకి ఎక్కింది. ఢిల్లీలో జరుగుతుందనుకున్న ఈ తంతు హైదరాబాద్‌లో తొలిసారి నిర్వహిస్తున్న సీడబ్ల్యూసీ (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) సమావేశాలకు మారింది. అయితే, సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణ, ముగింపు సమయంలో ఎలాంటి చడీచప్పుడు లేకుండా షర్మిల ఎపిసోడ్ హైదరాబాద్‌లో ముగిసింది.
కాంగ్రెస్ పార్టీ అత్యున్నత సమావేశాలు, పార్టీ అగ్రనేతల సమక్షంలో చేరిక విషయంలో షర్మిలకు షాక్ ఎదురయిందని అంటున్నారు. దీనికి కారణం షర్మిల పెట్టిన షరతులేనని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా పాలేరు నియోజకవర్గం సీటు విషయంలో షర్మిల పెట్టిన షరతు ఆమె చేరికకు అడ్డంకిగా మారిందని తెలుస్తోంది. మాజీ మంత్రి తుమ్మలను కాదని తనకే టికెట్ ఇవ్వాలనే షర్మిల షరతు విషయంలో కాంగ్రెస్ పెద్దలు అయిష్టత ప్రదర్శించినట్లు సమాచారం.
తుమ్మల నాగేశ్వరరావు తన నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచారు. మరో మూడు ఎన్నికల్లో ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి టీఆర్ఎస్ తరపున పోటీచేసి, కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయినప్పటికీ ఆయనకు నియోజకవర్గంలో పట్టుంది. ఈ నేపథ్యంలో తుమ్మలను కాదని షర్మిలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ పెద్దలు నో చెప్పడంతో షర్మిల షాక్ తిన్నట్లు సమాచారం. దీంతో ఆమెను బుజ్జగించవద్దని భావించిన కాంగ్రెస్ పెద్దలు `లైట్` తీసుకున్నట్లు సమాచారం. మొత్తంగా హైదరాబాద్ వేదికగా షర్మిల పార్టీ విలీనం ఆటలో అరటిపండు మాదిరిగా మారిపోయిందని చర్చ జరుగుతోంది.