కొద్దికాలంగా మౌనంగా ఉన్న ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తెర మీదకు వచ్చారు. వెనుకా ముందు చూసుకోకుండా తన సోదరుడు జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత ఏడాది స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన జగన్.. ఆ తర్వాత దాని గురించి పట్టించుకోలేదన్నారు. ఉక్కు పరిశ్రమ నిర్మాణం పూర్తి చేయాలని వైఎస్సార్ జిల్లా కలెక్టరర్ కు వినతిపత్రం అందజేశారు. ఉక్కు పరిశ్రమపై కాంగ్రెస్ తరఫు పోరాటం చేస్తామన్నారు.
ఈ సందర్భంగా ముంబయి నటి కాదంబరి జత్వానీ వ్యవహారంపై ఆమె స్పందించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాదంబరిని కట్టడి చేసేందుకు జగన్, సజ్జన్ జిందాల్ కలిసి ప్లాన్ చేశారన్నారు. సజ్జన్ జిందాల్.. జగన్ మధ్యనున్న సాన్నిహిత్యాన్ని గొప్పగా చెప్పుకున్నారన్న షర్మిల.. ‘‘జిందాల్ కు ఎందుకు అన్నికోట్ల రూపాయిల ఆస్తులు కట్టబెట్టారో జగన్ సమాధానం ఇవ్వాలి. కాదంబరి జత్వాని ఒక నటి. ఆమెను మానసికంగా వేధించారు. ఒక మహిళను అడ్డుకునేందుకు ఇంత నీచంగా మారాలా? సినీ పరిశ్రమలోకి వచ్చి ఎదగాలని భావించిన మహిలను మానసికంగా వేధించారు. కేసు పెట్టబోతే అక్రమంగా అరెస్టు చేసి తొక్కిపడేశారు’’ అని మండిపడ్డారు.
కాదంబరి కోరుకుంటే ఆమె తరఫు తాను పోరాటం చేస్తానని చెప్పిన షర్మిల.. ‘అలా అరెస్టు చేసి ఏపీకి తీసుకురావటం దుర్మార్గం. ఉన్నత కుటుంబానికి చెందిన మహిళను అరెస్టు చేసి వేధింపులకు గురి చేయటం దుర్మార్గం. జగన్ కు తెలీకుండానే అప్పటి ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులు వ్యవహరిస్తారా?’’ అని ప్రశ్నించారు. ఇద్దరు కుమార్తెలు ఉన్న జగన్.. జత్వానీకి జరిగిన అన్యాయంపై ఎందుకు ఆలోచించలేదంటూ నిలదీశారు. ఈ ఉదంతంపై జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.
ఇదిలా ఉంటే.. ఏపీలో సంచలనంగా మారిన గుడ్లవల్లేరు కాలేజీ ఉదంతంపై ఆమె ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. హిడెన్ కెమెరాల్ని భారీగా ఏర్పాటు చేశారన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ‘‘300 కెమెరాలు పెట్టారని చెబుతున్నారు. మరి ఎందుకు బయట పెట్టటం లేదు. కాంగ్రెస్ పార్టీ తరఫు మా సభ్యులు టీంలు కొన్ని అక్కడ సర్వే చేస్తే అదంతా ఫేక్ అని తేలింది. ఒకవేళ కెమెరాలు పెట్టినట్లు ఎవరైనా నిజాలు బయటకు తీస్తే బాధితుల తరఫు పోరాటం చేస్తా. బాత్రూంలోని షవర్ లో కెమెరాలు పెట్టి ఉంటే.. నీళ్లు పడితే బ్లర్ అవుతుంది కదా?’’ అని ప్రశ్నించారు. షర్మిల వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.