పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం, భద్రతా కారణాల రీత్యా ఆసియా కప్ లో కొన్ని మ్యాచ్ లను శ్రీలంకకు తరలించామని ఎసిసి అధ్యక్షుడు జై షా చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. మీడియా ప్రసార హక్కుల సంస్థలు, స్పాన్సర్లు కూడా మొత్తం టూర్ ను పాకిస్తాన్ లో నిర్వహించేందుకు విముఖత చూపడంతోనే కొన్ని మ్యాచ్ లను శ్రీలంకలో నిర్వహించాల్సి వచ్చిందని అన్నారు. ఇక, భద్రత కారణాల రీత్యా పాక్ లో మ్యాచ్ లు ఆడేందుకు భారత్ కూడా నిరాకరించిన సంగతి తెలిసిందే.
అయితే, శ్రీలంకలో మ్యాచ్ లకు వాన గండం పొంచి ఉండడం, కొన్ని మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దు కావడంతో పాక్ లో మ్యాచ్ లు నిర్వహించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని విమర్శలు వస్తున్నాయి. పాక్ లో కాకపోయినా యూఏఈలో టోర్నీ నిర్వహించి ఉంటే మ్యాచ్ లు వర్షార్పణం అయ్యేవి కావని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. అయితే, యూఏఈలో వేడి తీవ్రతను తట్టుకోలేమంటూ కొన్ని జట్లు అభిప్రాయపడడంతోనే పాక్ నుంచి శ్రీలంకకు కొన్ని మ్యాచ్ లను తరలించాల్సి వచ్చిందని జై షా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే షా వివరణపై పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది స్పందించారు.
పాక్ లో ఆటగాళ్ల భద్రతపై ఆందోళన అవసరం లేదని, గత ఆరేళ్లలో ఏ జట్టు ఎప్పుడు సురక్షితంగా పర్యటించి వెళ్ళింది అనే వివరాలను అఫ్రిది వెల్లడించాడు. ఇక, 2025 ఛాంపియన్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చేందుకు పాక్ సిద్ధంగా ఉందని ఈ మాజీ ఆల్రౌండర్ చెప్పాడు. టోర్నీ నిర్వహణ విషయంలో జై షా, బీసీసీఐకి ఎటువంటి అనుమానాలు అవసరం లేదని, అఫ్రిది చెప్పాడు. మరోవైపు, సెప్టెంబర్ 10న ఇండో-పాక్ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో మరుసటి రోజు రిజర్వ్ డే ప్రకటించిన సంగతి తెలిసిందే.