టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడం, ఆయనను నంద్యాల నుంచి విజయవాడకు తరలించడం.. ఈ రోజు(శనివారం) ఉదయం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఇక, తమ పార్టీ అధినేతను అరెస్టు చేయడం పట్ల టీడీపీ సీనియర్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునివ్వాలని నిర్ణయించారు. అయితే.. తెలతెల వారుతూనే పార్టీ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
చంద్రబాబు అరెస్టు పై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. “చంద్రబాబు అరెస్ట్ కోసం అర్థరాత్రి నుంచి హైడ్రామా నడిపారు. సీఎం జగన్ రెడ్డి ఆదేశాలతో ఆయన మెప్పుకోసమే సీఐడీ పరిధిదాటి వ్యవహరించారు. ఎప్పుడో 2021 డిసెంబర్లో స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై కేసు నమోదు చేస్తే, 20 నెలలవరకు ఈ ప్రభుత్వం ఎందుకు ఛార్జ్ షీట్ నమోదు చేయలేదు?“ అని ప్రశ్నించారు. నాలుగునెలల్లో అధికారం కోల్పోతున్నానన్న అక్కసుతోనే జగన్ ఇలాంటి ప్రజావ్యతిరేక చర్యలకు శ్రీకారం చుట్టాడని ధూళిపాళ్ల నరేంద్ర దుయ్యబట్టారు.
మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. సీఎం జగన్ రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని, స్కిల్ డెవలప్మెంట్ అనేది కార్పొరేషన్ – కార్పొరేషన్ యాక్టివిటీస్ కు ప్రభుత్వానికి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. పోలీసులు సివిల్ డ్రస్‌లో ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. 16 నెలలు జైల్లో ఉన్న జగన్ కు చంద్రబాబును జైలుకు పంపాలన్న కోరిక తీరదని వ్యాఖ్యానించారు. ఉద్దేశ పూర్వకంగానే చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. జీ20 సదస్సు జరుగుతుండగా చంద్రబాబు అరెస్ట్ తో ప్రపంచ వ్యాప్తంగా దేశం పరువుపోతోందని అన్నారు.
కాగా, అమరావతి భూముల కేసులో తన పేరును చేర్చారని, అయితే, ఎన్ని విచారణలు జరిగినా తన పేరు ప్రస్తావన రాలేదని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఏ కేసునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. చంద్రబాబు అరెస్టు జగన్మోహన్ రెడ్డి ఉన్మాదానికి పరాకాష్ట అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. దాదాపు 45సంవత్సరాల రాజకీయ జీవితంలో మచ్చలేని మనిషిగా చంద్రబాబు ఎదిగారని చెప్పారు. ఎఫ్ఐఆర్ కాపీలో పేరు లేని చంద్రబాబుని అరెస్ట్ చేయడం రాజకీయ కక్షేనని వ్యాఖ్యానించారు.