రాకేష్ మాస్టర్ అంటే.. ఇప్పటి జనం అంతా మీమ్ పేజీల్లో నిత్యం కనిపించే ఒక కమెడియన్ లాగా చూస్తారు కానీ.. ఆయన ఒకప్పుడు టాలీవుడ్లో పేరున్న డ్యాన్స్ మాస్టర్. ఏకంగా 1500 పాటలకు నృత్య రీతులు సమకూర్చాడంటే ఆయన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రభుదేవా, లారెన్స్, రాజు సుందరంల మాదిరి స్ఠార్ ఇమేజ్ లేకపోవచ్చు కానీ.. ఆయన 2000కు అటు ఇటు టాలీవుడ్లో బిజీ డ్యాన్స్ మాస్టర్లలో ఒకరు. ఆయన దగ్గర అసిస్టెంట్లుగా చేసిన చాలామంది ఇప్పుడు స్టార్ కొరియోగ్రాఫర్లుగా కొనసాగుతున్నారు.
వాళ్లందరిలోకి శేఖర్ మాస్టర్ అగ్రగణ్యుడు. శేఖర్ చాలా ఏళ్లు రాకేష్ దగ్గరే పని చేశాడు. తన గురువు రాకేష్ మాస్టర్ అని శేఖర్ కూడా చెప్పుకున్నాడు. రాకేష్ మాస్టర్ పలు సందర్భాల్లో శేఖర్ గురించి ప్రస్తావించాడు. ఐతే ఆదివారం మృతి చెందిన రాకేష్ మాస్టర్‌ను చూసేందుకు శేఖర్ రాలేదన్న వార్త ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
రాకేష్ మాస్టర్ మరణించిన నేేపథ్యంలో సినీ పరిశ్రమ నుంచి అసలు ఏమాత్రం స్పందన లేదంటూ ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు మీడియాకు బైట్స్ కూడా ఇస్తున్నారు. 1500 పాటలకు కొరియోగ్రఫీ చేసిన వ్యక్తికి పరిశ్రమ తరఫున నివాళి అర్పించడానికి ఎవరూ ముందుకు రావడం లేదని.. ఆయన అలాగే ఫిలిం చాంబర్ దగ్గర ఆయన పార్థివ దేహాన్ని పెట్టే ప్రయత్నం చేయలేదని.. కనీసం ఎవ్వరూ నివాళిగా ఒక మెసేజ్ కూడా ఇవ్వట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాకేష్ మాస్టర్‌కు అత్యంత ఇష్టమైన శిష్యుడు.. ఆయన వల్ల గొప్ప స్థాయికి చేరుకున్న శేఖర్ కూడా కడసారి చూపుకు రాలేదని వారంటున్నారు. శేఖర్ సినిమా షూటింగ్‌ల కోసం దూరంగా ఎక్కడ ఉన్నా కూడా తన గురువు కడసారి చూపుకు రావాలని.. కనీసం ఆయనకు నివాళిగా ఒక వీడియో బైైట్ కూడా ఇవ్వలేడా అని రాకేష్ మాస్టర్‌కు సన్నిహితుడైన ఒక లాయర్ ప్రశ్నించాడు.
ఈ విమర్శల నేపథ్యంలోనే ఎట్టకేలకు రాకేష్ మాస్టర్ పార్థివ దేహాన్ని శేఖర్ మాస్టర్ నిన్న రాత్రి సందర్శించారు. తన గురువు భౌతిక కాయాన్ని చూసిన శేఖర్ మాస్లర్ కంటతడి పెట్టారు.