తెలంగాణలో ఎన్నికల గడువు సమీపిస్తున్న సమయంలో… ప్రముఖులుగా ఉన్న నియోజకవర్గాలు వార్తల్లోకి ఎక్కుతున్న సంగతి తెలిసిందే. అలాంటి వాటిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క నాయకత్వంలోని ములుగు నియోజకవర్గం ఒకటి. టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి కోర్ టీంలో ముఖ్య నేత అయిన సీతక్కను ఎలాగైన ఓడించాలని అధికార బీఆర్ఎస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అయితే, గులాబీ పార్టీని ఎదుర్కునేందుకు సీతక్క కొత్త ఎత్తుగడ వేశారు. కోర్టును ఆశ్రయించి తన నియోజకవర్గంలో పట్టు పెంచుకునే ప్లాన్లో ఉన్నారు.
ములుగు నియోజకవర్గానికి నియోజకవర్గాల అభివృద్ధి నిధులు (సీడీఎఫ్) విడుదల చేయడం లేదని సీతక్క గత కొద్దికాలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్లో ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నియోజకవర్గాల అభివృద్ధి నిధుల మంజూరులో వివక్ష చూపుతోందని హైకోర్టులో ఎమ్మెల్యే సీతక్క పిటిషన్ దాఖలు చేశారు. 2022లో నియోజకవర్గ అభివృద్ధి నిధి కింద రెండు కోట్ల 60 లక్షల రూపాయలు మంజూరు చేసినట్టు ప్రభుత్వం సాంక్షన్ ఆర్డర్ ఇచ్చిందని అయితే ఇప్పటివరకు ఒక్క పైసా కూడా చెల్లించలేదని తెలిపారు.
చాలాకాలంగా ఎదురుచూస్తున్నప్పటికీ సీడీఎఫ్ ఇవ్వలేదని దీంతో ప్రజల సౌకర్యం కోసం రోడ్లు, డ్రైనేజీలు వంటివి నిర్మించడం పెండింగ్లో పడిందని వాపోయారు. ఈ విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తుందని ఆరోపించారు. మరో మూడు నాలుగు నెలల్లో శాసనసభకు ఎన్నికలు రాబోతున్నాయని తక్షణమే నిధులు మంజూరు చేస్తే ములుగు నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు తీసుకునేందుకు శాసనసభ్యురాలు చొరవ చూపుతారని సీతక్క తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వచ్చే డిసెంబర్ నాటికి ఎన్నికలు జరగవచ్చునని ఈలోగా నిధులు ఇవ్వకపోతే అవన్నీ వృధా అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నందున తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని ఈ పిటిషన్లో సీతక్క పేర్కొన్నారు. సీడీఎఫ్ మంజూరులో జిల్లా మంత్రి ప్రమేయం చట్ట విరుద్ధమ పేర్కొంటూ ఈ మేరకు జిల్లా మంత్రి ఆమోదంతో నిధులు మంజూరు చేయాలన్న జీవో 12 కొట్టేయాలని సీతక్క కోర్టును ఆశ్రయించారు. వెంటనే నిధులు విడుదలకు ఆదేశించాలని కోరిన సీతక్క తరఫు న్యాయవాది కృష్ణ కుమార్ గౌడ్ హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యే సీతక్క పిటిషన్ పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలిస్తూ విచారణ అక్టోబరు 9కి వాయిదా వేసింది.