స్థానిక ఎన్నికల విషయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ వ్యూహమేంటి? ఎందుకు ఆలస్యం చేయాలని అనుకుంటున్నారు? కేవలం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై ఆగ్రహంతోను.. ఆయన పై పంతంతోనేనా? అంటే.. ఇది ఒక పార్శ్వమేనని.. దీంతోపాటు మరికొన్ని కీలక అంశాలు కూడా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. స్థానికం ఆలస్యం వెనుక వ్యూహం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం కీలకమైన పథకాలు ఆలస్యం అవుతున్నాయి. వీటిలో ముఖ్యంగా పేదలకు ఇళ్లు.. ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న పథకం. ఇది కనుక పంపిణీ అయితే.. ఇక, తమకు తిరుగులేని విజయం ఖాయమని భావిస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో రెండు సెంట్ల వరకు భూమిని ఇస్తున్నందున అక్కడ ఏకపక్ష విజయాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని జగన్ భావిస్తున్నారు. అయితే, ఈ పేదలకు ఇళ్ల పంపిణీపై ఇప్పటికే అనేక ముహూర్తాలు పెట్టడం.. వాటిని వెనక్కి తీసుకోవడం తెలిసిందే. ఇప్పటికీ కోర్టు కేసులతో ఈ పథకం నత్తనడకన సాగుతోంది. దీంతో.. స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని భావిస్తున్నారు. ఇక, జిల్లాల విభజన. ఈ ఏడాది మార్చిలోనే స్థానికం జరిగిపోయి ఉంటే.. పేదలకు ఇళ్ల విషయం ప్రస్థావన ఉండేది కాదు. కానీ లేటైంది. దీంతో ఇప్పుడు దీంతోపాటు.. రాజధాని మార్పు వంటి కీలక విషయం కూడా ప్రజల్లో చర్చకు వస్తోంది.
అదేసమయంలో ఎలాగూ ఆలస్యమైంది కనుక.. వచ్చే జనవరి, ఫిబ్రవరి నాటికి జనాభా లెక్కలు పూర్తి అవుతాయని.. అప్పుడు జిల్లాల విభజనకు శ్రీకారం చుట్టుకోవచ్చని.. జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో జిల్లాల విభజన ప్రక్రియకు కొబ్బరికాయ కొట్టేసి.. అనంతరం ఎన్నికలకు వెళ్లవచ్చని అనుకుంటున్నట్టు వైసీపీలోని సీనియర్లు చర్చించుకుంటున్నారు. ఇక, అప్పటికి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పదవీ కాలం కూడా పూర్తవుతుందని ఇది తమకు అన్ని విధాలా లాభిస్తుందని.. జగన్ అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే ఇప్పటికిప్పుడు వివాదంలో పడిన పోలవరం ప్రాజెక్టు వంటి అంశాలు కూడాఅప్పటికి సర్దుకునే అవకాశం ఉంటుందని అంటే.. మరో ఆరు మాసాలు వాయిదా వేయడం వల్ల తమకు అనుకూల పవనాలు వీస్తాయని భావిస్తున్నారట. దీంతో స్థానికం వాయిదా వైపు జగన్ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. మరి వీరి వ్యూహం సఫలమవుతుందా? విఫలమవుతుందా? చూడాలి.