ఏపీలో పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే తొలివిడత ఎన్నికల నామినేషన్ల గడువు పూర్తయింది. పార్టీ రహిత ఎన్నికలయినప్పటికీ, పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా నేటి నుంచి ఏపీలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ మొదలు కాబోతోంది. ఏపీలోని 13 జిల్లాల్లో ఉన్న 20 రెవెన్యూ డివిజన్లలోని175 మండలాల్లో రెండో విడత ఎన్నికలు నిర్వహించబోతున్నారు. రెండోవిడత ఎన్నికల్లో మొత్తం 3,335 పంచాయతీలు, 33,632 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి రెండో విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానుంది. ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరకు నామినేషన్లు వేయవచ్చు.
ఫిబ్రవరి 5న అన్ని నామినేషన్లు పరిశీలించి ఫిబ్రవరి 6న నామినేషన్లపై అభ్యంతరాలను పరిశీలించనున్నారు. ఫిబ్రవరి 7న వచ్చిన అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఫిబ్రవరి 8న నామినేషన్ల ఉప సంహరణకు తుది గడువు. ఫిబ్రవరి 13న రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలు పెట్టి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. ఫలితాల వెల్లడైన వెంటనే ఫిబ్రవరి 4నే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించనున్నారు. కాగా, పంచాయతీ ఎన్నికల మొదటి దశ నామినేషన్ల గడువు ఆదివారం సాయంత్రంతో ముగిసింది. ఫిబ్రవరి 4వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు.