పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో ఏపీలో రాజకీయ వేడి రాజుకున్న సంగతి తెలిసిందే. షెడ్యూల్ ను హైకోర్టు సింగిల్ బెంచ్ నిలిపివేయడంతో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎస్ఈసీ…. హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం డివిజన్ బెంచ్ దగ్గర పెండింగ్ లో ఉంది. మరోవైపు, ఏపీ సర్కార్ పై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. కావాలనే జగన్ సర్కార్ ఎన్నికలను వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీంతోపాటు, ఎన్నికల విధులు నిర్వహించకుండా ఉద్యోగులను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలోనే నిమ్మగడ్డపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఆలయాలపై వరుస దాడుల నేపథ్యంలో నిమ్మగడ్డ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం వెనుక దురుద్దేశాలున్నాయని ఆరోపించారు. ఆలయాలపై దాడులు ఆగిన తర్వాతే ఎన్నికల షెడ్యూల్ రావడం అనుమానాలు రేకెత్తిస్తోందన్నారు.
ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి జీవీ సాయిప్రసాద్ ను, ఎన్నికల కమిషన్ కార్యదర్శి వాణీమోహన్ ను నిమ్మగడ్డ రమేశ్ తొలగించడంపై సజ్జల మండిపడ్డారు. ఉద్యోగులను బెదిరించేలా నిమ్మగడ్డ చర్యలున్నాయని, నిమ్మగడ్డ ఒక ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ బాధ్యత గల వ్యక్తిగా నిమ్మగడ్డ వ్యవహరించడం లేదని, నిమ్మగడ్డ ప్రతి అడుగు టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్ లోనే జరుగుతోందని సజ్జల ఆరోపించారు. మరో 4 నెలల్లో విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఈ లోపు దీనికి సంబంధించి కోర్టులో అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. సజ్జల వ్యాఖ్యలపై నిమ్మగడ్డ, టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.