ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పుతో ఇష్టం లేకున్నా పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధపడాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో, రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనతో తన విధిని సక్రమంగా నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ నేతలు విమర్శలకు దిగుతున్నారు. కొందరు వైసీపీ నేతలు మరో అడుగు ముందుకు వేసి నిమ్మగడ్డపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. నిమ్మగడ్డపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హద్దులు దాటి విమర్శలు గుప్పించారు. దీంతో, తాజాగా సజ్జలపై నిమ్మగడ్డ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
సజ్జలను పదవి నుంచి తొలగించాలంటూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు నిమ్మగడ్డ లేఖ రాశారు. రాజ్యాంగస్ఫూర్తికి వ్యతిరేకంగా సజ్జల రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని ఆ లేఖలో నిమ్మగడ్డ పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న నిమ్మగడ్డ …..ఏపీలో ఏకగ్రీవాలు దురుద్దేశపూర్వకంగా జరుగుతున్నాయని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఏకగ్రీవాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఏమీ లేవని.. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం వస్తున్నవేనని తెలిపారు. కొత్త అలజడి సృష్టిస్తే షాడో టీమ్‌లతో పర్యవేక్షిస్తామని.. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామని నిమ్మగడ్డ తెలిపారు.
కాగా, సజ్జలపై గవర్నర్‌కు నిమ్మగడ్డ లేఖ రాయడం చాలా మంచి పరిణామమని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. సీఎంకు మాత్రమే సజ్జల సలహాలివ్వాలని, రాజకీయ ప్రకటనలు, విమర్శలు చేయకూడదని రఘురామ మండిపడ్డారు. ఏపీలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని, ఈ సమయంలో ఎస్ఈసీపై విమర్శలు చేయడం ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పెద్దిరెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని, క్యాబినెట్ హోదాలో ఉంటూ ఎస్ఈసీపై విమర్శలు చేసిన సజ్జలపై తప్పని, అతనిపై గవర్నర్ చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్టు తెలిపారు. కేబినెట్ హోదా ఉన్న సజ్జల ప్రభుత్వోద్యోగి కిందే లెక్క అని, పనికిమాలిన వారినందరినీ జగన్ సలహాదారులుగా నియమించుకున్నారని మండిపడ్డారు. ఎవరైనా హైకోర్టును ఆశ్రయిస్తే సజ్జలకు ఇచ్చిన హోదా తొలగిపోతుందని అభిప్రాయపడ్డారు. మరి, ఈ వ్యవహారంపై గవర్నర్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.