ఏపీ సర్కారు తాజా నిర్ణయం తీవ్ర విమర్శల పాలవుతోంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఏపీలో ప్రాథమిక పాఠశాలలు తెరవనున్నట్లు ఏపీ సర్కారు ప్రకటించింది. నిన్నటి వరకు వ్యాక్సిన్ వేయకుండా ఎన్నికల్లో ఎలా పాల్గొంటాం, మా ప్రాణాలకు రక్షణ ఏదీ అంటూ ఏపీ ఉద్యోగులు గోలపెట్టారు.
కానీ ఇపుడు ఏకంగా పసికందుల స్కూళ్లు తెరిచారు. ఎవరూ తెరవమని డిమాండ్ చేయలేదు. అయినా స్కూళ్లు తెరిచారు. కానీ ఎన్నికలు పెడితే మాత్రం కరోనా భయం ఉందంటారు. మరి పిల్లలకు వ్యాక్సిన్ వేయకుండా ఎలా స్కూళ్లు తెరుస్తారు అంటూ ప్రజలు ప్రభుత్వ ద్వంద వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నారు.
ఫిబ్రవరి 1 నుంచి తరగతులు నిర్వహిస్తారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చేసిన ప్రకటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగుల ప్రాణాల మీద అంత ప్రేమ ఒలకబోసిన వైసీపీపెద్దలకు, మంత్రులకు మరిపుడు పిల్లలు ఏమైపోయినా పర్లేదా అని జనం ప్రశ్నిస్తున్నారు.
కొత్త నిబంధనల ప్రకారం పాఠశాల నడుపుతామని, ప్రతి తరగతి గదిలో 20 మంది విద్యార్థులకే అనుమతి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. గదులు సరిపోని చోట ప్రత్యామ్నాయ రోజుల్లో తరగతులు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ‘‘మా పిల్లలు కరోనా వస్తే మీ బాధ్యత కాదు, మా పిల్లలను మేమే కరోనాకు బలిచేస్తున్నాం’’ అని తల్లిదండ్రుల లిఖితపూర్వక హామీతోనే విద్యార్థులకు అనుమతి ఉంటుందట.