పోలీసులకు సమాచారమిచ్చి మరీ బాంబ్ బ్లాస్ట్?...ఢిల్లీలో హై అలర్ట్

గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో రైతుల కిసాన్ ట్రాక్టర్ ర్యాలీలో జరిగిన అవాంఛనీయ ఘటనలు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రైతుల ర్యాలీ ఘర్షణలు సద్దుమణగక ముందే ఢిల్లీలో తాజాగా బాంబు పేలుళ్ల ఘటనతో దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విజయ్ చౌక్ కు కేవలం కిలోమీటర్ దగ్గరలో ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి 50 మీటర్ల దూరంలో భారీ స్థాయిలో పేలుళ్లు సంభవించడం చర్చనీయాంశమైంది. ఈ పేలుళ్ల ధాటికి పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. పూల కుండీలో బాంబ్ పెట్టినట్లు అధికారులు గుర్తించారు. పేలుడు జరగడానికి కొద్ది నిమిషాలకు ముందు గుర్తు తెలియని అగంతకులు పోలీసులకు ఫోస్ చేసి పేలుడుపై సమాచారమిచ్చినట్టు తెలుస్తోంది. పేలుడుకి ఐఈడీ వాడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాదులున్నారా లేక సెన్సేషన్ క్రియేట్ చేయడానికే ఆకతాయిలు చేసిన పనా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఏది ఏమైనా, తాజా పేలుడుతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు.

రిపబ్లిక్ డే నాడు దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన కిసాన్ ట్రాక్టర్ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చెలరేగిన ఘర్షణలో ఒక రైతు చనిపోగా....ఎర్రకోటపై రైతులు జెండా ఎగురవేయడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ క్రమంలోనే ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. దీనికితోడు, ఈరోజు నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అదనపు బలగాలను ఢిల్లీలో మోహరించారు. మరోవైపు, నేడు విజయ్ చౌక్ దగ్గర బీటింగ్ రిట్రీట్ జరుగుతున్న నేపథ్యంలోనూ ఆ ప్రాంతమంతా పోలీసులు, భద్రతా బలగాలు, పారామిలటరీ బలగాలతో నిండిపోయి ఉంది. ఇంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ దేశ రాజధాని నడిబొడ్డులో బాంబు పేలుడు జరిగిన ఘటక కలకలం రేపుతోంది. మరోవైపు, ఇప్పటికే రిపబ్లిక్ డేనాడు జరిగిన ఘర్షణల నేపథ్యంలో రైతుల నిరసనను కేంద్రం నీరుగార్చాలని చూస్తోందని రైతులు ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. ఘజియాబాద్ లో నిరసన స్థలం ఖాళీ చేయాలని రైతులను ఒత్తిడి చేయడం.... తాజా బ్లాస్ట్ వంటి ఘటనల నేపథ్యంలో రైతుల ఆందోళనపై నీలి నీడలు కమ్ముకున్నట్టు కనిపిస్తున్నాయి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.