పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం గెలుపు తమదేనని చెప్పుకొంటూ వచ్చిన అధికార వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది. తాము అమలు చేస్తున్న పథకాలు ప్రపంచంలో ఎవరూ అమలు చేయడం లేదని..సో..తమ వెంటే ప్రజానీకం ఉందని భావించిన వైసీపీ పెద్దలకు పంచాయతీ ఎన్నికలు గట్టి షాకిచ్చాయి. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల ట్రెండును బట్టి సుమారు 1000 పంచాయతీల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మద్దతు దారులు గెలపు గుర్రాలు ఎక్కారు. ఇది వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బగానే భావించాలని అంటున్నారు పరిశీలకులు.
వలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చినా.. ఇతరత్రా పథకాలు అమలు చేసినా.. పేదలకు కీలకమైన ఇళ్లను ఇచ్చినా.. కూడా వైసీపీ దూకుడు పెద్దగా ప్రభావం చూపించలేక పోయింది. అదేసమయంలో ఎన్నికల విషయంలో ఏకపక్షంగా వ్యవహరించి ఏకగ్రీవాలను ప్రోత్సహించేందుకు కూడా ప్రయత్నాలు చేసినా.. అవి కూడా ఫలించలేదు. మరీముఖ్యంగా మూడు రాజధానుల విషయం కూడా వికటించిందనే వాదన ఉంది. ఇది పంచాయతీ ఎన్నికల్లో స్పష్టంగా తెలిసిపోయిందని అంటున్నారు. నిజానికి పాలనసరిగా ఉండి ఉంటే.. ఈ ఫలితాలు డిఫరెంట్‌గా ఉండేవి. కానీ. ఏకపక్ష ధోరణులు, కోర్టులను సైతం లెక్కచేయకపోవడం వంటివి బలంగా ప్రభావం చూపాయని తెలుస్తోంది.
తాము ఏం చేసినా.. ప్రజలు మెచ్చుకుంటారనే ధోరణిలో ఉన్న వైసీపీ నాయకులకు పంచాయతీ ఎన్నికలు పెద్ద ఎఫెక్టే. ఇక, ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ.. పుంజుకుంది. అదేసమయంలో బీజేపీ, జనసేన, కాంగ్రెస్‌లు కూడా పుంజుకున్నాయి. ఈ ఫలితాలు.. రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పడం ఖాయమనే భావన సర్వత్రా వినిపిస్తోంది. ఇప్పటి వరకు అధికార పార్టీ ఆడింది ఆటగా ఉన్నా.. ఇకపై అయినా..మార్పులు చేసుకుని ప్రజాభిప్రాయాన్ని గమనించి నడుచుకోకపోతే.. వచ్చే ఎన్నికల నాటికి ఇబ్బందులు తప్పవని అంటున్నారు పరిశీలకులు. మరి ఆదిశగా అడుగులు వేస్తారో లేదో చూడాలి.