“కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో అల్లాడిపోతున్న నా సొంత దేశం.. భారత్‌లో పరిస్థితి చూసి నా హృదయం ముక్కలైంది“ అని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్‌లో ఆసుపత్రులు నిండిపోయాయని, నిత్యం వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడుతున్నారన్న వార్తలు తనను తీవ్రంగా బాధించాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి ఏదేశానికీ రాకూడదని తాను భావిస్తున్నట్టు సత్యనాదెళ్ల భావోద్వేగానికి గురయ్యారు.
ఇంత విపత్కర పరిస్థితిలో భారత్‌లో ఆక్సిజన్ పరికరాల కొనుగోలుకు మద్దతిస్తామని భారత్‌కు సాయం చేసేందుకు మైక్రోసాఫ్ట్ వనరుల్ని ఉపయోగిస్తామని సత్య అన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారత్‌కు సహాయమందించేందుకు రూ.135 కోట్ల సహాయ నిధి అందిస్తున్నట్లు వెల్లడించారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో భారత్ కు సాయం చేసేందుకు ముందుకొచ్చిన అమెరికాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత విపత్కర పరిస్థితి నుంచి భారతదేశంలోని ప్రతి ఒక్కరూ అత్యంత త్వరగా కోలుకుని సాధారణ జీవనం గడపాలని సత్య అభిలషించారు.
సుందర్ పిచాయ్ ఏమన్నారంటే..
అదేవిధంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా భారత్ లోని కొవిడ్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద దేశంలో ప్రజలకు సరైన వైద్య అందించాలని ప్రభుత్వాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, కరోనా సెకండ్ వేవ్‌ను తట్టుకునేందుకు ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని అన్నారు. అదేవిధంగా కరోనా రాగానే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. సంయమనంతో ఆరోగ్యాన్ని సంరక్షించుకునే విధానాలు అనేకం ఉన్నాయని.. ఖంగారే.. కరోనాకు ప్రధాన శత్రువని.. అనేక మంది వృద్ధులు కూడా కరోనాను జయించిన సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయని పిచాయ్ ఉదహరించారు. భారత్ తిరిగి త్వరలోనే మామూలు స్థితికి చేరుకుంటుందని పేర్కొన్నారు.