కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్న మార్పును తాను తీసుకొస్తానని ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి శశిథరూర్ పేర్కొన్నారు. పోటీలో ఉన్న మరో అభ్యర్థి మల్లికార్జున ఖర్గేపై ఆయన తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
“ఖర్గే వృద్ధుడు. ఆయన వల్ల ఏమవుతుంది. రాజ్యసభలో ఒక్క బిల్లునైనా.. ఆయన ఆపగలిగారా? కనీసం.. గట్టి వాయిస్ ఉందా? ఆయన ఎక్కడో ఎవరికో రాజీ పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఆయన పార్టీని ఎలా లైన్లో పెడతారు. మార్పు సాధ్యం కాదు“ అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. ఖర్గేతో బహిరంగ ముఖాముఖి నిర్వహిస్తే.. తన బలం ఏంటో.. ఖర్గే బలం ఏంటో తెలుస్తుందని థరూర్ అన్నారు. ఎవరినో ఎదిరించడానికి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఖర్గే స్పష్టంచేసిన విషయంపై.. ఆయన స్పందిస్తూ.. ఎన్నికల తర్వాత ఏ నిర్ణయమైనా నాయకులంతా సమష్టిగా తీసుకుంటామని చెప్పారు.
తిరువనంతపురం ఎంపీ అయిన థరూర్ అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సభ్యుల హృదయాల్లో నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందని తెలిపారు.
పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లుకు సమర్ధవంతమైన నాయకత్వంతో పాటు సంస్థాగత సంస్కరణల కలయికే పరిష్కారమ ని థరూర్ పేర్కొన్నారు. “ప్రపంచస్థాయి సంస్థలకు నాయకత్వం వహించిన నాకు మెరుగైన ట్రాక్ రికార్డ్ ఉంది. ఖర్గేకు ఆ రికార్డు లేదు.
ప్రపంచవ్యాప్తంగా 77 కార్యాలయాలలో 800 మంది సిబ్బందితో కూడిన యూఎన్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్కు సెక్రటరీ జనరల్‌గా సమర్థంగా సేవలు అందించాను. ఆ సంస్థ నిర్మాణాన్ని హేతుబద్ధీకరించాను. బడ్జెట్‌ను తగ్గించాను. 2017లో స్థాపించిన ఆల్ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్‌కు వ్యవస్థాపక ఛైర్మన్‌గా ఉన్నాను“ ఇవన్నీ నాకు ఉన్న అర్హతలు.
ఖర్గేకు వీటిలో ఒక్కటి అయినా ఉందా అని ప్రశ్నించారు. కేవలం ఐదేళ్లలో 20 రాష్ట్రాల నుంచి 10,000 మంది సభ్యులు అందులో ఉన్నారు. నామినేషన్ తేదీకి ఎన్నికల తేదీ మధ్య, దాదాపు రెండున్నర వారాల సమయమే ఉంది కాబట్టి 9,000 పీసీసీ ప్రతినిధులందరినీ సంప్రదించడం చాలా కష్టం. కాబట్టి ముఖాముఖి చర్చ పెడితే ఎక్కువమందికి ఒకేసారి సందేశం ఇవ్వొచ్చు. ఎవరు ఏంటనేది తేలిపోతుంది.. అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాయకులందరనీ ఏకతాటిపైకి తీసుకొచ్చి.. పార్టీని గొప్పగా నడిపించిన రికార్డు గాంధీలకు ఉంది. పార్టీ కోసం వారు సాధించిన దాన్ని ఎప్పటికీ మనం మరచిపోకూడదు. కాంగ్రెస్ పార్టీ సభ్యుల హృదయాల్లో నెహ్రూ-గాంధీ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంటుంది.
మనలో చాలా మంది రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలను తీసుకుంటారని భావించాం. కానీ అది జరగలేదు. ముఖ్యంగా సోనియా, రాహుల్, ప్రియాంక ఈ ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతు ఇవ్వడం లేదు అని శశిథరూర్ చెప్పారు. కాగా.. ఆయన చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఏం చేస్తుందో చూడాలి.