‘ఉప్పెన’ అనే బ్లాక్‌బస్టర్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు బుచ్చిబాబు సానా. ఆ సినిమా రిలీజైన కొన్ని నెలలకే అతడికి జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా ఓకే అయింది. ‘నాన్నకు ప్రేమతో’ రోజుల నుంచే తారక్‌తో బుచ్చిబాబుకు మంచి సాన్నిహిత్యం ఉండడం, ‘ఉప్పెన’ సెన్సేషనల్ హిట్టవడంతో వీరి కాంబినేషన్ ఓకే కావడానికి ఎంతో సమయం పట్టలేదు. కానీ సినిమా అయితే ఓకే అయింది కానీ.. అది ముందుకు కదలడంలో ఇబ్బంది తప్పలేదు. అందుకు ప్రధాన కారణం తారక్ వేరే ప్రాజెక్టులతో లాక్ అయి ఉండడం. ముందు ‘ఆర్ఆర్ఆర్’ పూర్తి చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కొరటాల శివ మూవీ లైన్లోకి వచ్చింది.
ఇది కాక ప్రశాంత్ నీల్తోనూ ఒక కమిట్మెంట్ ఉంది. వీటి మధ్య బుచ్చిబాబు సినిమాను ముందుకు తీసుకెళ్లడం కష్టమే అయింది. ఒక దశలో కొరటాల మూవీని హోల్డ్ చేసి బుచ్చిబాబు సినిమాను పట్టాలెక్కించడానికి ఒక ప్రయత్నం జరిగింది కానీ.. అది వర్కవుట్ కాలేదు.
కట్ చేస్తే ఇప్పుడు రామ్ చరణ్‌తో బుచ్చిబాబు ప్రాజెక్టు ఓకే అయింది. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఐతే బుచ్చిబాబుకు ఆశ చూపించి.. తారక్ హ్యాండిచ్చాడా.. చరణ్ అతణ్ని ఆదుకున్నాడా అనే చర్చ నడుస్తోంది ఇప్పుడు. కానీ వాస్తవం ఏంటంటే.. బుచ్చిబాబు తారక్ నుంచి చరణ్‌కు మళ్లడం సుహృద్భావ వాతావరణంలోనే జరిగింది. ఈ ముగ్గురి మధ్య మంచి అండర్‌స్టాండింగ్‌తోనే ప్రాజెక్టు చేతులు మారినట్లు సమాచారం.
కొరటాల సినిమా ఆలస్యం అవుతున్నప్పటికీ ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి బుచ్చిబాబుతో తారక్ సినిమా చేసే పరిస్థితి లేదు. ఉప్పెన రిలీజై ఇంకో రెండు నెలలకు రెండేళ్లు పూర్తవుతుంది. బుచ్చిబాబును మరీ ఎక్కువ వెయిట్ చేయిస్తే అతడి కెరీర్‌కు చేటు చేసినట్లు అవుతుంది. కొరటాలతో మూవీ అయ్యేసరికి ప్రశాంత్ నీల్ తనతో సినిమాకు రెడీగా ఉండే అవకాశాలు లేకపోలేదు. ప్రశాంత్‌తో వెంటనే సినిమా చేయకపోతే అతను మళ్లీ దొరకడం కష్టం. అందుకే బుచ్చిబాబుతో సినిమాను ఎప్పుడు పట్టాలెక్కించాలన్నదానిపై తారక్‌కే క్లారిటీ లేదు. ఈ పరిస్థితుల్లోనే అతను వేరే హీరోను చూసుకోమని బుచ్చిబాబుకు చెప్పగా.. అతను చరణ్‌కు అదే కథను వినిపించడం.. అతను తారక్‌తో మాట్లాడాక ఈ సినిమాను ఓకే చేయడం జరిగందన్నది సన్నిహితుల సమాచారం.