ఒకప్పుడు ప్రేమకథలకు బాగా సూటయ్యే స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఉండేది సమంత. ఆమెకు మంచి పేరు తెచ్చిందే ‘ఏమాయ చేసావె’ అనే లవ్ స్టోరీ. ఆ తర్వాత కమర్షియల్ సినిమాలు ఎక్కువగా చేసినప్పటికీ.. హృద్యమైన ప్రేమకథలకు ఆమెకు మంచి ఛాయిస్‌గా ఉండేది. మాస్ సినిమాలు చేస్తూనే ఎటో వెళ్లిపోయింది మనసు, మనం, అఆ, మజిలీ లాంటి ప్రేమకథా చిత్రాలతో ఆమె మెప్పించింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి పెద్ద సినిమాల్లో సైతం సున్నితమైన పాత్రలతో ఆకట్టుకుంది.
కానీ గత కొన్నేళ్లలో సమంత ఇమేజ్ బాగా మారిపోయింది. యుటర్న్, యశోద లాంటి సినిమాల్లో.. ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్‌లో సమంత రఫ్ అండ్ టఫ్ రోల్స్ చేయడం.. తన లుక్స్‌లో కూడా సున్నితత్వం పోవడంతో ఆమె ప్రేమకథలకు సూట్ కాని పరిస్థితి వచ్చింది. పెళ్లి.. విడాకుల వ్యవహారం, వయసు పెరగడం, అనారోగ్యం కూడా ఆమెను ప్రేక్షకులు చూసే కోణంలో మార్పు తీసుకొచ్చాయి.
ఇవన్నీ కలిసి ‘ఖుషి’ లాంటి ప్రేమకథలో సమంతను ప్రేక్షకులు అంగీకరించలేకపోతున్నారు. ఓవైపు విజయ్ దేవరకొండ చాలా యూత్‌ఫుల్‌గా కనిపిస్తుంటే తన పక్కన సమంత సూట్ కాలేదనిపించింది. తన లుక్స్ సహజంగా లేవు. సీజీ వర్క్ ద్వారా కరెక్షన్లు జరిగిన విషయం తెర మీద స్పష్టంగా తెలిసిపోయింది. ప్రేమకథా చిత్రాల్లో కథానాయికను చూసి హీరోలో ఎలా ఆరాధన భావం కలుగుతుందో కుర్రాళ్లలో కూడా అలాంటి ఫీలింగ్ కలగాలి. హీరో హీరోయిన్ని చూసి మైమరిచిపోతుంటే.. తపించి పోతుంటే అది కన్విన్సింగ్‌గా అనిపించాలి.
కానీ ‘ఖుషి’లో సమంతను చూస్తే ఆ పీలింగ్ ప్రేక్షకులకు కలగలేదు అన్నది వాస్తవం. ఇందులో సమంతను విమర్శించడానికేమీ లేదు. ఒక్కో వయసులో ఒక్క తరహా పాత్రలే చేయాలి. ఒక వయసు దాటాక, ఇమేజ్ మారాక గతంలో చేసిన పాత్రలు సూట్ కావు. సమంత పరిస్థితి కూడా అంతే. కాబట్టి ఇక నుంచి ఇలాంటి క్లాస్ టచ్ ఉన్న ప్రేమకథల జోలికి సమంత వెళ్లకపోతేనే బెటర్.