టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో యమా జోరు చూపిస్తూ ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నాడు. ఇటీవలె ఈయన `లైగర్` అనే పాన్ ఇండియా చిత్రాన్ని పూర్తి చేసుకున్నాడు. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టులో విడుదల కాబోతోంది. ఈలోపే విజయ్ మళ్లీ పూరీతోనే `జనగణమన` అనే కొత్త ప్రాజెక్ట్ ను షురూ చేశాడు. ఆర్మీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోన్న ఈ దేశభక్తి చిత్రం ముంబైలో గ్రాండ్ గా ప్రారంభమైంది.
అయితే ఈ సినిమా ఇంకా పూర్తి కాకుండానే మరో మూవీని పట్టాలెక్కించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. `నిన్ను కోరి`,`మజిలీ` వంటి సినిమాలతో గుర్తింపు దక్కించుకున్న ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణతో విజయ్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇదో ప్రేమకథా చిత్రమని.. ఇందులో సమంత హీరోయిన్ గా నటించబోతోందని ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ సినిమాకు `ఖుషీ` అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు కూడా టాక్ నడుస్తోంది
అయితే నేడు విజయ్-సమంతల ప్రేమాయణం మొదలైంది. విషయం ఏంటంటే.. గురువారం ఉదయం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో విజయ్, శివ నిర్వాణల సినిమా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి.. చిత్ర టీమ్ కు బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ పూజా కార్యక్రమానికి సమంత అటెండ్ కాకపోయినా.. విజయ్ వచ్చి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా, విజయ్ కెరీర్ లో తెరకెక్కుతున్న 11వ సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మితమవుతోంది. మనసుని హత్తుకునే ప్రేమకథతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ మరి కొద్ది రోజుల్లోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అలాగే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి.