తెలుగు హీరోలతో బాలీవుడ్ హీరోయిన్లు కలిసి నటించడం కామనే కానీ.. అక్కడి హీరోలు మన హీరోలతో జట్టు కట్టడం మాత్రం అరుదే. చాలా వరకు బాలీవుడ్ స్టార్లకు ఆ అవసరం కూడా కనిపించేది కాదు. ఇక్కడి వాళ్లు కూడా వాళ్లను అంతగా సంప్రదించేవారు కూడా కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది.
సౌత్ సినిమాలు దేశవ్యాప్తంగా అదరగొడుతున్న నేపథ్యంలో తాము కూడా ఇక్కడ పాపులర్ కావాల్సిన అవసరం ఉందనో ఏమో.. బాలీవుడ్ స్టార్లు సౌత్ సినిమాలతో, ఇక్కడి తారలతో అనుబంధం పెంచుకుంటున్నారు. ఇటీవలే ‘కేజీఎఫ్-2’ సినిమాలో సంజయ్ దత్ విలన్‌గా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
మరోవైపు తన సినిమా ‘లాల్ సింగ్ చద్దా’లో నాగచైతన్యను నటింపజేయడం ద్వారా దక్షిణాదిన ఈ చిత్రాన్ని బాగా మార్కెట్ చేసునే ప్రయత్నంలో ఉన్నాడు ఆమిర్ ఖాన్. మరోవైపు సల్మాన్ ఖాన్ ఒకదాని తర్వాత ఒకటి తెలుగు చిత్రాలు ఓకే చేస్తుండం విశేషం.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో ప్రత్యేక అతిథి పాత్రకు సల్మాన్ ఓకే చెప్పడం తెలిసిందే. ఈ సినిమాలో ఒక పాటలో చిరుతో కలిసి స్టెప్పులేయనున్న సల్మాన్.. కొన్ని ముఖ్య సన్నివేశాల్లోనూ తళుక్కుమనబోతున్నాడు. ఇది కాక మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌తోనూ ఆయన జట్టు కట్టబోతున్నట్లు ఇంతకుముందు వార్తలు రావడం తెలిసిందే.
ఇప్పుడా విషయాన్ని స్వయంగా వెంకీనే ధ్రువీకరించాడు. తన కొత్త చిత్రం ‘ఎఫ్-2’ ప్రమోషన్లలో భాగంగా తాను ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ నిజం కాబోతోందని, సల్మాన్ ఖాన్‌తో ఎట్టకేలకు సినిమా చేయబోతున్నానని వెంకీ వెల్లడించాడు. ఐతే ఇది తెలుగు సినిమానా.. లేక పాన్ ఇండియా మూవీనా.. దీని దర్శకుడు, నిర్మాత వివరాలేంటి అన్నది వెంకీ వెల్లడించలేదు.
వేరే ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి వెంకీ మాట్లాడుతూ.. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు ఒక సినిమా కమిటయ్యానని.. అలాగే ‘బాబు బంగారం’ చేసిన సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లోనూ ఓ సినిమా చేయబోతున్నానని తెలిపాడు. కానీ ఈ చిత్రాలకు దర్శకులెవరన్నది మాత్రం చెప్పలేదు.
తన గత రెండు చిత్రాలు నారప్ప, దృశ్యం-2 ఓటీటీల్లో విడుదల కావడం వల్ల, అవి మరీ సీరియస్ సినిమాలు కావడం వల్ల తన అభిమానులు వాటిని సరిగా చూడలేదని.. ఇప్పుడు ‘ఎఫ్-2’ థియేటర్లలో రిలీజవుతుండటం, పైగా మంచి ఎంటర్టైనర్ కావడంతో దీనికి గొప్ప ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నానని వెంకీ చెప్పాడు.