తెలుగు సినిమాలో సల్మాన్ ఖాన్ నటించడమే స్పెషల్ అంటే.. ఆ సినిమాలో చిరంజీవి హీరో కావడం డబుల్ స్పెషల్. మెగాస్టార్ హీరోగా మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ‘గాడ్‌ఫాదర్’లో సల్లూ యాక్ట్ చేస్తున్నాడని తెలిసినప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ ఆనందానికి అంతు లేకుండా పోయింది. తను ఎప్పుడు హైదరాబాద్ వస్తాడా, చిరుతో కలిసి షూటింగ్లో పాల్గొంటాడా అని తెగ వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు తెలిసిందేంటంటే.. సల్మాన్ హైదరాబాద్ రావట్లేదు. చిరుయే ముంబై వెళ్తున్నారు.
ముంబైలో సల్మాన్ ఖాన్‌కి ఓ ఫామ్ హౌస్ ఉన్న సంగతి అందరికీ తెలుసు. షూటింగ్ లేని సమయంలో అతను ఎక్కువగా అక్కడే గడుపుతుంటాడు. వ్యవసాయం కూడా చేస్తుంటాడు. ప్రైవేట్ సాంగ్స్ లాంటి వాటి షూటింగ్‌ని కూడా అక్కడే కానిచ్చేస్తాడు.
అందుకే తనకి అనుకూలంగా ఉండటం కోసం ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్ పార్ట్ సీన్స్‌ని ఆ ఫామ్ హౌస్‌లో తీయడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో చిరు, సల్మాన్‌లపై ఓ పాట కూడా ఉంటుంది. దీన్ని మాత్రం ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో షూట్ చేస్తారట.
బాలీవుడ్లో సల్మాన్ స్థాయి ఏంటో తెలిసిందే. అతను అంత ఈజీగా ఓ తెలుగు సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకోడు. అది కూడా హీరోకి అనుచరుడి పాత్రలో. అయినా ఒప్పుకున్నాడు అంటే దానికి ఒకే ఒక్క కారణం.. చిరంజీవి. ఆయనతోటి, రామ్ చరణ్తోటి సల్మాన్‌కి చాలా మంచి స్నేహం ఉంది.
దానివల్లే నో అనకుండా ఒప్పుకున్నాడు. అందుకే తనకి ఏ ఇబ్బందీ లేకుండా కంఫర్ట్‌గా ఫీలవ్వడం కోసం చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచే షూటింగ్ స్టార్టవుతుందని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో చూడాలి మరి.