బాహుబలితో ఆకాశమంత ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ హీరో.. కేజిఎఫ్ మూవీతో సంచలనం రేపిన ప్రశాంత్ నీల్ దర్శకుడు దర్శకుడు.. కేవలం వీళ్లిద్దరి కాంబినేషనే సలార్ సినిమాకు ఎక్కడ లేని హైట్ తీసుకొచ్చింది. సరైన ప్రమోషనల్ కంటెంట్ ఇవ్వకపోయినా.. సినిమా ముందు అనుకున్న డేట్ నుంచి వాయిదా పడ్డా.. ఇంకా చాలా నెగిటివ్స్ ఉన్నా సరే సినిమాకు హైప్ తప్ప తగ్గలేదు.
సలార్ టీం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించినా సరే ప్రభాస్ అభిమానులు ఓపికతోనే ఉన్నారు. కానీ వారి ఓపికకు మరీ పరీక్ష పెట్టేస్తోంది. సినిమా వాయిదా పడుతున్న సంగతి చెప్పరు. వాయిదా తర్వాత కొత్త డేట్ వెంటనే ఇవ్వరు. చెప్పిన డేట్ కి ట్రైలర్ రిలీజ్ చేయరు. పాటలు వదలరు. ఇలా ప్రతి దశలోనూ సలార్ టీం నిర్లక్ష్యమే వహించింది. అయినా అభిమానులు సినిమాను భుజం మీద మోస్తూనే వచ్చారు. కానీ రిలీజ్ దగ్గర పడ్డాక కూడా సలార్ టీం లో ఏ మాత్రం మార్పు లేదు.
ఇంతకుముందు వచ్చిన ట్రైలర్ అంచనాలకు తగ్గట్టు లేకపోవడంతో కొత్త ట్రైలర్ వదలాలని చిత్ర బృందం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ అది రిలీజ్ చేయడంలోనూ విపరీతమైన జాప్యం తప్ప లేదు. ఇదిగో అదిగో అంటూ నానుస్తూనే వచ్చారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సలార్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి కానీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నిరీక్షణ తప్పట్లేదు.
సినిమాకు అత్యంత హైప్ ఉన్నది ఏపీ, తెలంగాణలోనే. కానీ ఇక్కడ ముందు చెప్పినట్లుగా ఆదివారం బుకింగ్స్ ఓపెన్ కాలేదు. అభిమానులు బుక్ మై షో సహా టికెటింగ్ యాప్స్ ఓపెన్ చేసి పెట్టుకొని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎంతకీ టికెట్లు అందుబాటులోకి రావట్లేదు. సలార్ మూవీకి ఉన్న హైప్ దృష్ట్యా ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఏమరుపాటుగా ఉన్నా.. కోరుకున్న థియేటర్లో టికెట్లు ఖాళీ అయిపోతాయి.
అందుకనే అభిమానులు ఓపికతో ఎదురుచూస్తున్నారు. కానీ వారి నిరీక్షణకు తెరపడట్లేదు. షోలు, టికెట్ల ధరల విషయంలో ఇంకా అనుమతులు రాకపోవడం వల్ల ఈ ఆలస్యం జరుగుతుండొచ్చు. కానీ ఇవన్నీ ముందే చూసుకోవాల్సిందే. ప్రేక్షకుల అభిమానాన్ని మరీ గ్రాంటెడ్ గా తీసుకుని, వారి సహనాన్ని మరీ పరీక్షిస్తే రిలీజ్ తర్వాత ఇబ్బందులు తప్పక పోవచ్చు. కాబట్టి సలార్ టీం ఇప్పటికైనా జాగ్రత్త పడితే మంచిది.