కండబలం.. కత్తి బలం కంటే కూడా కలానికి ఉన్న పవర్ ను గుర్తించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక పత్రికను తీసుకొచ్చారు. తెలుగునాట అప్పటివరకు లేని ఒక కొత్త కల్చర్ ను తీసుకొచ్చారు. మన వాదనను మనం వినిపించుకోవాలనే మాటకు ముందుగా.. తన తప్పుల్ని ఎత్తి చూపించే వారందరిని పచ్చమీడియా అన్న ట్యాగ్ వేసేశారు. అదే నిజమని నమ్మించారు.
తన పత్రికను తీసుకురావటంతోనే.. గతాన్ని తవ్వి తీయించి.. వరుస పెట్టి అక్షర దాడులు చేయించారు.
రాజకీయంగా ప్రత్యర్థుల్ని ఎదుర్కోవటానికి వైఎస్ అనుసరించిన మార్గాల్లో అదొకటి. అది కాస్తా సూపర్ సక్సెస్ అయ్యింది.
అప్పటి నుంచి తమ ప్రత్యర్థులు ఎవరైనా సరే.. వారి సంగతి చూడటానికి అక్షరాన్ని ఆయుధంగా ప్రయోగించేవారు. అదే సమయంలో లాజిక్కులు ఏ మాత్రం మిస్ కాకుండా.. చరిత్రలో జరిగిన విషయాల్ని తమకు తగ్గట్లుగా మార్చుకొని వాదనలు వినిపించారు. తమ వర్గానికి అక్షరాల్ని ఆయుధాలుగా అందించారు. సందర్భం ఏదైనా కావొచ్చు.. మొండిగా వాదించే అలవాటు కూడా చేశారు.
అప్పటి సంధి.. ఇప్పటివరకు ఎవరినైనా సరే.. అక్షరంతో తాట తీసే ప్రోగ్రాంను విజయవంతంగా అమలు చేశారు. ఇప్పుడే వారికో ఇబ్బంది వచ్చి పడింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గడిచిన పది రోజులుగా చేస్తున్న వాదనలు.. వినిపిస్తున్న వ్యాఖ్యలు.. తిట్టే తిట్లను విని విననట్లుగా ఉంటున్నారే తప్పించి.. స్పందించింది కనిపించట్లేదు.
ఇంతకాలం పచ్చ పత్రికలుగా ముద్ర వేసిన వారు.. క్రిష్ణా జలాల విషయంలో ఏపీ చేసిన తప్పేమీ లేదని చెబుతున్నా.. ఆశ్చర్యకరంగా సాక్షి కలాలు మాత్రం ఒక్క అక్షరాన్నిఝుళిపించలేకపోతున్నా
ఇంత అన్యాయంగా మాట్లాడతారా? న్యాయం అంటూ లేదా? అని తరచూ మాట్లాడే మాటలు కూడా మూగబోయాయి. చివరకు వాస్తవాల్ని రాసి.. ఏపీ ఎలాంటి తప్పు చేయలేదన్న విషయాన్ని చెప్పేందుకు కూడా ధైర్యం సరిపోని పరిస్థితి. ఇన్నాళ్లు తమ ప్రత్యర్థుల విషయంలో అదే పనిగా విరుచుకుపడే అలవాటున్న సాక్షి కలాలు.. ఇప్పుడు కదల్లేకుండా ఉండిపోయాయి?
తమ మహానేతను దొంగ అంటున్నా మౌనంగా ఉండటం.. తమ యజమానిని గజదొంగ అని అంటున్నా.. కామ్ గా ఉండటం చూస్తే..సాక్షి పెన్నుకుండే పాళి విరిగిపోయిందా? అన్న సందేహం రాక మానదు. విషయం ఏదైనా సరే..తమకు అనుకూల వాదనను బండగా వినిపించేందుకు సైతం వెనుకాడని వారు ఇప్పుడింత మౌనంగా ఉండటం ఎందుకు? తమకు అన్నం పెట్టే అధినేతను అన్నేసి మాటలు అంటున్నా.. సాక్షి కలాలు ముందుకు కదలకపోవటమే స్వామిభక్తికి నిదర్శనమా?