రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా ఉండేలా.. వైసీపీ సర్కారు మరోసారి పగ్గాలు చేపట్టకుండా చూసేలా.. జనసేన, తెలుగు దేశం పార్టీలు జట్టుకట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆది నుంచి కూడా ఈ ఇరు పార్టీలూ కలవ కుండా చూసేందుకు అధికార పార్టీ వైసీపీ అనేక వ్యూహాలు పన్నింది. `దమ్ముంటే.. ఒంటరి పోరు చేయాలి`, జగన్ అంటే భయపడుతున్నారు కాబట్టే కలుస్తున్నారు, ఒంటరిగా పోటీ చేసే దమ్ములేదు. ఒంటరిగా పోటీ చేసేందుకు నాయకులు కూడా లేరు.. అంటూ వైసీపీ నాయకులు, మంత్రులు ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఈమేరకు కామెంట్లు చేసి.. టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
అంతేకాదు.. కొన్ని కొన్ని సందర్భాల్లో టీడీపీకి పవన్ అమ్ముడు పోయారని.. కాపులు ఆయన వెంట తిరగొద్దని కూడా వైసీపీ నాయకులు సూచనలు చేశారు. ఒక్కొక్క నియోజకవర్గంలో రంగంలోకి దిగిన ఎమ్మెల్యేలు.. కాపులతో మైండ్ వాష్ కూడా చేశారు. అయినప్పటికీ.. ఎన్ని విమర్శలు చేసినప్పటికీ.. టీడీపీ-జనసేన పొత్తు అయితే ఖాయమైంది. దీంతో వైసీపీకి పరిస్థితు లు మింగుడు పడలేదు. ఈ నేపథ్యంలో తాజాగా అందివచ్చిన ఓ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నా లు ప్రారంభించింది. అదే టికెట్ల కేటాయింపు. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా టీడీపీ.. 118 స్థానాలను ప్రకటించింది.
దీనిలో టీడీపీ 94 సీట్లు ఉంచుకుని, జనసేనకు 24 సీట్లు ఇచ్చింది. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా ప్రకటించారు. 175 స్థానాల్లో 24 చోట్ల జనసేన నేతలు పోటీ చేస్తారని చెప్పారు. దీనిని ఆసరాగా తీసుకున్న వైసీపీ నాయకులు.. పొత్తును విచ్ఛిన్నం చేసేలా వ్యూహాత్మకంగా కాపులను రెచ్చగొట్టే పనిని ప్రారంభించారనే వాదన వినిపిస్తోంది. ఈపొత్తులో భాగంగా బలమైన నాయ కులు, ఎట్టి పరిస్థితిలోనూ వైసీపీ దూకుడును తట్టుకుని గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని భావించిన నాయకులను మాత్రమే వచ్చే ఎన్నికల్లో పోటీకి నిలబెట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జనసేన ఎక్స్పెక్ట్ చేసిన `తణుకు` వంటి వాటిలోనూ టీడీపీ పోటీ చేయాల్సి వచ్చింది.
అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గంలోనూ జనసేన పోటీ చేస్తుందని అనుకున్నా.. తర్వాత టీడీపీనే ఈ సీటు తీసుకుంది. దీనిలో తప్పులేదని పవన్ కూడా ప్రకటించారు. “వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి మాత్రమే తమ లక్ష్యమని“ ఆయన ప్రకటించా రు. ఈ నేపథ్యంలో సీట్ల సంఖ్యను పట్టించుకోబోమని కూడా వ్యాఖ్యానించారు. అయితే.. ఈ మిత్రపక్షంలో చిన్నపాటి లొసుగుల ను తమకు అవకాశంగా మలుచుకున్న వైసీపీ వ్యూహాత్మకంగా కాపుల్లో చిచ్చు పెట్టే ప్రయత్నాలుముమ్మరం చేసిందనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. “మీరంతా బలంగా ఉన్నారు. మీ కు టికెట్ ఇస్తామని ఇవ్వలేదు. ఇది మోసం చేయడమే. గట్టిగా పోరాడండి. బయటకు రండి. రోడ్డెక్కి నినాదాలు చేయండి“ అంటూ.. కాపు నాయకులకు వైసీపీ నుంచి సందేశాలు వెళ్తున్నాయని సమాచారం.
పవన్ కాపులకు అన్యాయం చేశాడని.. మీరు పోటీ చేయాల్సిన స్థానాలను కూడా టీడీపీకి ఇచ్చేశారని.. ఇన్నాళ్లు మీరు జెండాలు మోశారని.. ఇప్పుడు కనీసం మిమ్మల్ని పట్టించుకోలేదని.. ప్యాకేజీ పాలిటిక్స్ అంటే ఇవేనని.. వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్నారెడ్డి నూరిపోస్తున్నట్టు సమాచారం. కొందరు కాపులకు ఆయనే నేరుగా టచ్లోకి వెళ్లి.. మరికొందరి విషయంలో వేరేవారిని నియమించి కూడా.. ఇలా కాపుల్లో చిచ్చె పెట్టి, కాపుల ఓట్లు టీడీపీకి మళ్లకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. భారీ కుట్ర పన్నారనే వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో అవసరమైతే.. ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా హామీ ఇస్తున్నట్టు సమాచారం. ఇదే కనుక నిజమైతే.. క్షేత్రస్థాయిలో టీడీపీతో పొత్తు ఉన్నప్పటికీ.. కాపు ఓటు బ్యాంకు ఆ పార్టీకి పడకుండా చేయడంలో వైసీపీ పెద్ద కుట్రకు పాల్పడుతున్నట్టేనని అంటున్నారు పరిశీలకులు.