ఏపీ సీఎం జగన్ సొంత చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసుపై ప్రభుత్వ సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి వివేకా పెద్దదిక్కుగా ఉన్నారని.. పార్టీని నడపడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు.అయితే.. ఆయనను దారుణంగా చంపిన డ్రైవర్ దస్తగిరిని లొంగదీసుకొని కొందరు తమకు అనుకూలంగా మార్చుకున్నారని, వైసీపీకి వ్యతిరేకంగా కేసును మార్చే కుట్ర చేశారని ఆరోపించారు.
సీబీఐ తమను వేధించడానికి, జగన్మోహన్ రెడ్డిని తప్పుగా చూపించడానికి ప్రయత్నిస్తోందని సజ్జల మండిపడ్డారు. జగన్కు వ్యతిరేకంగా వివేకానంద రెడ్డి కాంగ్రెస్లో ఉన్నారని.. ఆ తరువాత వివేకానంద రెడ్డి వైసీపీలోకి వచ్చారన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా కుటుంబ పెద్దగా వివేకానంద రెడ్డిని పార్టీలోకి తీసుకున్నారని తెలిపారు. వైసీపీ పెట్టినప్పుడే జగన్ తన పార్టీ ప్రతినిధిగా పులివెందులలో అవినాష్ రెడ్డిని పెట్టారని సజ్జల చెప్పారు. వివేకా హత్యకు పొలిటికల్ అజెండా కారణం అనడానికి అవకాశం ఎక్కడ ఉందని ప్రశ్నించారు.
వివేకా హత్యకు మోటివ్ వేరే ఉందని.. సాక్షాలను చేరిపేశారు అని అనడానికి అవకాశం లేదని తెలిపారు. వివేకా హత్య కేసులో అసలైన సాక్ష్యం వివేకా రాసిన లెటర్.. దానిపై సీబీఐ దృష్టి పెట్టడం లేదని అన్నారు. టీడీపీ చెప్పిన లైన్లో సీబీఐ విచారణ చేయడం దురదృష్టమన్నారు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ తీర్పుతో న్యాయం గెలిచిందన్నారు. వివేకా కూతురు చేసిన కార్యక్రమాలు ఇవాళ కాకపోతే రేపు అయినా బయటకు రాక తప్పదని అన్నారు.
జగన్ ఢిల్లీ వెళితే కోర్టులను ప్రభావితం చేయగలరా.. ఇది కోర్టులను కించపర్చడం కాదా అని నిలదీశారు. తన తండ్రిని ఓడించిన వారితో సునీత కలిసి తిరుగుతున్నారని సజ్జల ఆరోపించారు. సునీతకు రాజకీయాల్లోకి రావడంపై ఆసక్తి ఉందన్నారు. దస్తగిరి వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. ప్రజలకు మంచి చేయడం టీడీపీ దృష్టిలో నేరాలు, ఘోరాలు అంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.