కొంతకాలంగా వైసీపీ, జనసేనల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. పవన్ ను ఇరుకున పెట్టేందుకు వైసీపీ నేతలు సకల ప్రయత్నాలు చేస్తున్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఆఖరికి పవన్ ప్రచార రథం వారాహిపై కూడా వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల బంపర్ ఆఫర్ ఇచ్చారు.
కౌలు రైతులకు సంబంధించి తాము అమలు చేస్తున్న దానికన్నా ఏదైనా మెరుగైన విధానం ఉంటే పవన్ చెప్పాలని సజ్జల అన్నారు. కౌలు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి అవసరమైన సాయం అందిస్తున్నామని సజ్జల తెలిపారు. ప్రభుత్వం కౌలు రైతులకు అండగా నిలుస్తోందని..ఇంకా ఏమైనా చేయాల్సి ఉంటే చెప్పవచ్చని సజ్జల పేర్కొన్నారు. ఈ నెల 18న గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ పాల్గొని చెక్కులు అందించనున్నారు. గతంలో తూర్పు గోదావరి..అనంతపురం జిల్లాల్లో ఇదే తరహా యాత్రలు నిర్వహించి చెక్కులు అందజేశారు.
ఇక, ఏపీలో ముందస్తు ఎన్నికలపై కూడా సజ్జల స్పందించారు. టీడీపీలో ఊపు లేకే చంద్రబాబు ముందస్తు ఎన్నికలంటున్నారని సజ్జల అన్నారు. టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకే చంద్రబాబు ముందస్తు అంటూ మాయమాటలు చెబుతున్నారని సజ్జల ఆరోపించారు. పొత్తులు, ఎత్తులు వంటి ఆలోచనలు చేయాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తే మంచిదేనని, కానీ, తెలంగాణలో వైసీపీ పోటీ చేయబోదని అన్నారు. మరి, సజ్జల కామెంట్స్ పై పవన్ రియాక్షన్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.