ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి తాజాగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అయితే.. ఈ సందర్భంగా ఆయన చేసిన ఆరోపణలపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అవే అవే ఆరోపణలు పదే పదే ఎందుకు సార్.. ? అని ప్రశ్నిస్తున్నారు. దీంతో సజ్జల చేసిన కామెంట్లు ఏంటనేది చర్చకు వచ్చింది.
+ చంద్రబాబు పాలనలో కనీసం విజయవాడలో ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేకపోయారని సజ్జల ఎద్దేవా చేశారు. అయితే.. సహజంగానే ఏ ప్రభుత్వంలో అయినా.. కొన్నికొన్ని పనులు ప్రారంభిస్తారు. ఎన్నికల సమయం వచ్చేసరికి అవి పూర్తికాకపోతే.. తప్పు ఆ ప్రభుత్వానిది ఎలా అవుతుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
+ ఉదాహరణకు కడప ఉక్కు ఫ్యాక్టరీని సీఎం జగన్ 2020లోనే మరోసారి శంకుస్థాపన చేశారు. ఇది ఆయన హయాంలో అయ్యే అవకాశం లేకపోతే.. వచ్చే ప్రభుత్వం చేపడుతుంది. అప్పుడు కూడా ఇలానే అంటారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
+ ఇక, అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు అండ్ కో దోచుకోవడం తప్ప అభివృద్ధి చేసిన పాపాన పోలేదని విమర్శించారు. ఈ ఆరోపణలు ఎప్పటి నుంచో చేస్తున్నవేనని.. వీటిలో ఒక్క దాన్నయినా నిరూపించారా? అని నెటిజన్లు ప్రశ్నలు సంధించారు.
+ చంద్రబాబు అమరావతిని ఏటీఎంలా మార్చుకుని దోచుకున్నారని సజ్జల మండిపడ్డారు. ఆనాడు సీఎంగా ఉండి చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరించారని విమర్శించారు. చంద్రబాబు బినామీల పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారని విమర్శించారు. ఐదేళ్లలో చంద్రబాబు అమరావతిపై కేవలం రూ.5వేల కోట్లు ఖర్చు పెట్టారని గుర్తు చేశారు. టెంపరరీ బిల్డింగ్లు, సగం రోడ్లు వేసి వదిలేశారన్నారు.
+ అయితే.. ఇన్సైడర్ ట్రేడింగ్‌ను వైసీపీ ప్రభుత్వం నిరూపించిందా? సజ్జల సర్? అని ప్రశ్నించారు నెటిజన్లు. ఇక్కడ ఏమీ జరగలేదని.. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు తీర్పు ఇచ్చినా.. ఇంకా అదే పట్టుకుని వేలాడడం ఎందుకని ప్రశ్నించారు.
+ చంద్రబాబు హయాంలోనే ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఫోన్ ట్యాపింగ్‌లు చేశారని సజ్జల అన్నారు. అయితే.. దీనిపై ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలో కమిటీ వేసిన వైసీపీ ప్రభుత్వం ఏం తేల్చిందని.. నెటిజన్లు ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఏమీ తేల్చ లేకపోయారు కదా! కనీసం ఆ టెక్నాలజీని కొనుగోలు చేసిన ఆధారాలు కూడా లేవు కదా! అని నిలదీశారు. ఇంకా.. ఎందుకీ పసలేని ఆరోపణలు అని ప్రశ్నిస్తున్నారు.