వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు సజ్జల భార్గవరెడ్డిలో టెన్షన్ మొదలైందా? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాన్ మరియు వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు పోసాని. అయితే రిమాండ్ రిపోర్ట్‌లో పోసాని సంచలన విషయాలు బయటపెట్టారు. పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ కుటుంబ సభ్యులను దూషించినట్లు ఒప్పకోవడమే కాక.. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు సజ్జల భార్గవరెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ఆధారంగానే తాను ప్రెస్మీట్లలలో, సోషల్ మీడియాలో వారిని బూతులు తిట్టానని, విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడానంటూ వాంగ్మూలం ఇచ్చారు.
దాంతో తండ్రీకొడుకులు అడ్డంగా ఇరుక్కున్నారు. పోసాని రిమాండ్ రిపోర్ట్ బయటకు రాగానే సజ్జల, ఆయన కుమారుడు సజ్జల భార్గవరెడ్డిలో అరెస్ట్ భయం మొదలైంది. రాత్రికి రాత్రి ఎక్కడ అరెస్టు చేయడానికి వస్తారో అని తండ్రీకొడుకులు శుక్రవారమే హైకోర్టును ఆశ్రయించారు. పోసాని వివాస్పద కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ పెట్టుకున్నారు.
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె లో నమోదు చేసిన కేసులో ఏ1గా ఉన్న పోసాని తమ పేర్లను వాంగ్మూలంలో చెప్పారని.. అది తప్ప ఇందులో తమ పాత్ర ఉందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. తాము అమాయకులమని, తమను అనవసరంగా ఈ కేసులో ఇరికిస్తున్నారని.. ముందస్తు బెయిలు ఇవ్వాలని సజ్జల, భార్గవరెడ్డి ఆ పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రాబోతుంది. అయితే న్యాయస్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు సజ్జల భార్గవరెడ్డికి అనుకూలంగా తీర్పు వస్తుందా? ఒకవేళ రాకుంటే తండ్రీకొడుకుల నెక్స్ట్ స్టెప్ ఏంటి? బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్తారా? అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి.