కీలకాంశాల మీద మాట్లాడేటప్పుడు భారీ కసరత్తు అవసరం. అందునా.. కోర్టులకు సంబంధించిన వివాదాల మీద వ్యాఖ్యలు చేసే వేళలో.. ఆచితూచి అన్నట్లుగా మాట్లాడాలే తప్పించి.. రాజకీయ ప్రత్యర్థుల మీద నోరు పారేసుకున్నట్లుగా మాట్లాడితే నష్టమే తప్పించి లాభం ఉండదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణ.. తాజాగా ఎంపీ అవినాశ్ కు సంబంధించిన ఎపిసోడ్ తో కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కారు ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా చేస్తున్నాయి.
సీబీఐ విచారణ కోసం నోటీసులు జారీ చేసిన ప్రతిసారీ.. అవినాష్ ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఉన్నది ఉన్నట్లు చెప్పేసేందుకు ఎందుకింత కిందా మీదా పడటం? అన్నది ప్రశ్నగా మారింది. తప్పు చేయలేదన్న ధీమా ఉన్నప్పుడు సీబీఐ ముందుకు వెళ్లి.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేస్తే సరిపోతుంది కదా? అన్న ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు లేకపోగా.. దాగుడుమూతల తరహాలో వ్యవహరిస్తున్న వైనంతో కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అంతిమంగా ఈ వ్యహారం జగన్ సర్కారుకు తలనొప్పిగా మారుతోంది. ఇది సరిపోదన్నట్లుగా ఏపీ ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల సైతం ఇలాంటి ఇష్యూస్ మీద మాట్లాడి విషయం మరింత రచ్చ అయ్యేలా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన ఆయన.. నాలుగేళ్ల క్రితం ఇదే రోజున (2019, మే 23న) ఎన్నికల ఫలితాలు వచ్చాయన్న విషయాన్ని గుర్తు చేశారు. మే 30న జగన్ ప్రమాణస్వీకారం చేశారన్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలోని 98.5 శాతం హామీల్ని అమలు చేసినట్లుగా చెప్పిన సజ్జల.. అక్కడితో ఆగి ఉంటే బాగుండేది.
అవినాశ్ ఉదంతం గురించి ప్రశ్నలు ఎదురైతే.. వాటి మీద విడిగా మాట్లాడదామని చెప్పి ముగించి ఉంటే బాగుండేది. అది కూడా కాదనుకుంటే.. వెళ్లిపోతే సరిపోయేది. అందుకు భిన్నంగా ఆయన ఎదురుదాడి షురూ చేశారు. అవినాశ్ తన తల్లికి బాలేదని చెప్పి.. సీబీఐ అరెస్టు చేస్తామంటే ఎస్పీ సహకరించలేదని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ‘‘మీడియా క్రియేట్ చేసిన తుపాను దెబ్బకు పార్టీ.. ఆయన అభిమానులు ఏమిటీ అన్యాయం అని వస్తారు. ఎవరైనా కాస్త ఆవేశానికి లోనైతే మీడియా మీద దాడి అంటున్నారు. ఎవరైతే కరుడుగట్టిన అభిమానులు ఉంటారో వాళ్లకు చెప్పకుండానే ఆవేశం వస్తుంది. సీబీఐ.. రాష్ట్ర పోలీసులను అవినాశ్ అరెస్టు కోసం సాయం చేయమని అడిగారా? అది డిపార్ట్ మెంట్.. డిపార్ట్ మెంట్ మధ్య జరుగుతుంది. మనకు ఎలా తెలుస్తుంది. అవినాశ్ టైం అడిగాడు ఇస్తే ఏమవుతుంది? టైం తీసుకొని అప్పుటికి రాకపోతే అరెస్టు చేస్తారు? గవర్నమెంట్ కు అవినాశ్ వ్యవహారానికి సంబంధం లేదు’’ అని వ్యాఖ్యానించారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే.. అవినాశ్ టైం అడిగాడు.. ఇస్తే ఏమవుతుంది? అంటున్న సజ్జల మాటలకు.. గడిచిన నాలుగేళ్లలో తమ ప్రభుత్వంలో పోలీసులు చేసిన అరెస్టులు కళ్ల ముందు రీళ్ల మాదిరి గుర్తుకు వస్తాయన్న విషయాన్ని ఆయన ఎందుకు మిస్ అవుతున్నారు. అర్థరాత్రి దాటిన తర్వాత.. తెల్లవారుజామున.. గోడలు దూకి.. తలుపులు బద్ధలు కొట్టి మరీ.. కేసులున్న వారిని అరెస్టు చేసినప్పుడు కూడా.. నోటీసులు ఇచ్చి వారు వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేయలేదు? అని అడిగితే ఏమని బదులిస్తారు? ఇలాంటి ప్రశ్నలకు తలెత్తేలా సజ్జల ఎందుకు మాట్లాడుతున్నారు? కొత్త చర్చకు ఎందుకు తెర తీస్తున్నారు? ఇదంతా చూసినప్పుడు సజ్జల ఒక్కడు చాలు.. జగన్ సర్కారు ఇమేజ్ ను దెబ్బేయటానికి? అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.