రాష్ట్రంలో బీసీలకు తాము తప్ప ఎవరూ న్యాయం చేయడం లేదంటూ.. మరోసారి డప్పు కొట్టుకున్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు.. విపక్షాలు ముద్దుగా.. సకల శాఖా మంత్రి అని పిలుచుకునే సజ్జల రామకృ ష్ణారెడ్డి. జగన్ వచ్చిన తర్వాతే.. బీసీలు ముందుకు అడుగులు వేస్తున్నారని.. వారికి పదవులు దక్కుతు న్నాయని ఆయన చెప్పిందే చెప్పుకొచ్చారు. రాజకీయ సాధికారత దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు.. విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు.
తాజాగా ఎమ్మెల్యే కోటాలోని 7 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన దరిమిలా.. వారికి సీఎం జగన్.. పార్టీ తరఫున ఫాంలు అందజేశారు. ఈ సందర్భంగా.. సజ్జల మరోసారి బీసీలకు తాము తప్ప ఎవరూ అండగా నిలిచింది లేదంటూ.. కామెంట్లు చేశారు. మొత్తం 18 స్థానాలకు సోషల్ ఇంజనీరింగ్ అమలు చేశారని, 18 స్థానాల్లో 14 స్థానాలకు బీసీ అభ్యర్థులనే సీఎం జగన్ ఎంపిక చేశారని సజ్జల చెప్పుకొచ్చారు.
సార్వత్రిక ఎన్నికల నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకు సామాజిక న్యాయం దిశగా అడుగులు వేశాంటూ.. సీఎంజగన్పై సజ్జల ప్రశంసల జల్లు కురిపించేశారు. అదేసమయంలో బీసీల పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు ఇన్ని పదవులు ఎందుకు ఇవ్వలేదు..? అంటూ నిలదీశారు. మహిళలకు కూడా న్యాయం చేయలేదని.. వ్యాఖ్యానించారు.
సరే.. ఓకే.. టీడీపీ విషయాన్ని పక్కన పెడితే.. బీసీలపై అంత ప్రేమ ఉన్న సీఎం జగన్ ఆ వర్గానికి ముఖ్యమంత్రి స్థానాన్ని కట్టబెట్టే ధైర్యం చేయగలరా? అనేది నెటిజన్ల కామెంట్. బీసీలకు సాధికారత రావాలంటే.. రాష్ట్రంలో బీసీలకు కూడా పాలించే అర్హత కల్పించాలని.. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే.. బీసీలకు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగిస్తే.. అప్పుడు నిజంగానే సీఎం జగన్ బీసీల విషయంలో న్యాయం చేశారని అందరూ అడగకుండానే చప్పట్లు కొడతారని వ్యాఖ్యానిస్తున్నారు. మరి దీనిపై సజ్జల ఏమంటారో చూడాలి.