నలభై ఏళ్ల పార్టీని ఉద్దేశించి ఏమయినా సంభాషించవచ్చు కాదనం కానీ వయస్సులో ఆయన సీనియర్ హుందాతనం కోల్పోకూడదు అని అంటోంది టీడీపీ.. సాయిరెడ్డిని ఉద్దేశిస్తూ… కాలం చెల్లిన పార్టీ టీడీపీ అని గతంలోనూ వైసీపీ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తరువాత తప్పు దిద్దుకునే ప్రయత్నాలేవో చేసింది.
ఇప్పటికిప్పుడు ఏ పార్టీ ఎలా ఉందో అన్నది ఓటరు మాత్రమే చెప్పగలడు. కానీ కొన్ని నివేదికల ఆధారంగా వైసీపీ అత్యుత్సాహం చూపించడం వల్ల ప్రజా క్షేత్రంలో అభిమానాన్ని కోల్పోయే ప్రమాదమే ఎక్కువ అన్నది ఇంకొందరి మాట. వారి మాట ఎలా ఉన్నా కూడా బండ్ల గణేశ్ వివాదంతో పాటు మరికొన్ని విషయాలకు సంబంధించి వైసీపీ స్పందించేటప్పుడు గతం కన్నా మరికొంత జాగ్రత్త పాటింపు తప్పనిసరి!
అతి విశ్వాసం కారణంగా మాట్లాడకూడదు. ఆ విధంగా మాట్లాడి చాలా మంది చాలా ఇబ్బందులనే చవి చూశారు. అతి విశ్వాసం కారణంగా పార్టీలు కొన్ని ఇంటికే పరిమితం అయి ఉన్నాయి కూడా ! అయినా ఏ విషయంలో కూడా ఆత్మ నిబ్బరం ఉండడం తప్పు కాదు. సాధిస్తామన్న దృక్పథం కారణంగా విజయాలు వరిస్తాయి కూడా ! కానీ ఇతరులను కించపరిచి మాట్లాడితే రాజకీయ క్షేత్రంలో ఇంకా చెప్పాలంటే ప్రజా క్షేత్రంలో విజయాలు రావు. అవమానాలే పలకరిస్తాయి. అభద్రతకు సంబంధించిన భావనలే వెన్నంటి ఉంటాయి. అందువల్ల అతి కారణంగా సాధించేదేమీ ఉండదు.
ఉన్నంతలో వైసీపీ మాట్లాడే తీరు బాగుంటే టీడీపీ తీరు కూడా బాగుంటుంది అని అంటున్నారు ఆ పార్టీ పెద్దలు. ఉన్నంతలో వైసీపీ హుందాతనం తో కూడిన భాష మాట్లాడి మంచి పేరు తెచ్చుకుంటే తాము కూడా అదేవిధంగా వారిని గౌరవిస్తామని, ప్రజాక్షేత్రంలో మేలయిన, హుందాతనంతో కూడిన పోటీ ఏర్పడుతుందని కూడా అంటున్నారు.
కానీ ఇప్పుడు ఇందుకు విరుద్ధంగా భాష ఉంటుంది అని పసుపు పార్టీ అంతర్మథనం చెందుతోంది. ముఖ్యంగా టీడీపీ అంతు తేలుస్తా అని విజయ సాయిరెడ్డి లాంటి ఎంపీ మాట్లాడడం తప్పు అని అంటోంది. ఇది ఆయన స్థాయికి తగని భాష అని కూడా హితవు చెబుతోంది. నాలుగు దశాబ్దాల కాలంలో చేసిన ప్రయాణంలో ఏ రోజూ ఇటువంటి భాషను తాము వినలేదని కూడా అంటోంది.
ఇక టీడీపీ పతనం వైసీపీ కోరుకోవడంలో అర్థం ఎలా ఉన్నా అసలు సాధ్యమేనా ! ఇప్పటికిప్పుడు టీడీపీ అంతు తేలుస్తా అని చెప్పడం భావ్యమేనా ! వైసీపీ కన్నా టీడీపీ ఎన్నో రాజకీయ ఒడిదొడుకులు దాటి వచ్చిన పార్టీ. ఎవ్వరు ఎన్ని అనుకున్నా కూడా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కొంత కాలం తిరుగులేని చరిష్మాను నిలుపుకున్న పార్టీ. అటు దేశ రాజకీయాల్లోనూ మంచి ప్రభావం చూపిన పార్టీ.
ప్రత్యర్థి పార్టీని వైసీపీ తిట్టడం అన్నది వారి సొంత అభిప్రాయం కావొచ్చు. కానీ ఆత్మ విశ్వాసం కట్టు తప్పి అతి విశ్వాసంగా పరిణమిస్తేనే, రూపాంతరం చెందితేనే ప్రమాదకరం. తత్ ఫలితంగా ముందున్న కాలంలో ఆశించిన ఫలితాలు వచ్చినా, రాకపోయినా ఇప్పటి మాటలు డిజిటల్ మీడియాలో రికార్డు అయి ఉంటాయి. అవే నేతల ప్రవర్తనను పట్టి చూపిస్తాయి.