ఓవైపు వరుస ఫ్లాపులు.. మరోవైపు రోడ్డు ప్రమాదంలో గాయాలు.. దీంతో ఒక దశలో మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్ కెరీరే ప్రమాదంలో పడ్డట్లు కనిపించింది. ప్రమాదం తేజు ఒంటి మీద ప్రతికూల ప్రభావం చూపడంతో మళ్లీ ముందులా సినిమాలు చేయగలడా.. చేసినా కెరీర్లో పుంజుకోగలడా అన్న సందేహాలు కలిగాయి.
ఐతే ‘విరూపాక్ష’ మూవీతో అతను బ్యాంగ్ బ్యాంగ్ రీఎంట్రీ ఇచ్చాడు. తర్వాతి చిత్రం ‘బ్రో’ నిరాశపరిచినా.. తేజు లైనప్ అయితే ఇంట్రెస్టింగ్‌గానే కనిపించింది. ముందుగా అతను సంపత్ నంది దర్శకత్వంలో ‘గాంజా శంకర్’లో నటించాల్సింది. ఈ సినిమా గురించి ఘనంగా అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్ కూడా ఆకట్టుకుంది. ఐతే ఇప్పటిదాకా షూట్ గురించి అప్డేట్స్ అయితే ఏమీ లేవు.
ఐతే ‘గాంజా శంకర్’ ముందుకు కదలడం మీద ఇప్పుడు సందేహాలు ముసురుకుంటున్నాయి. ఈ సినిమా టైటిల్ మార్చాలని సూచించడంతో.. అలాగే కథ విషయంలో కొన్ని షరతులు పెట్టింది నార్కోటిక్స్ బ్యూరో. డ్రగ్స్‌ను ప్రమోట్ చేసేలా సినిమా ఉంటే ఇబ్బందులు తప్పవని అధికారులు చెప్పకనే చెప్పారు. ఈ మార్పులు చేర్పులతో స్క్రిప్టు అటు ఇటు అయ్యే అవకాశముంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు బడ్జెట్ సమస్యలు కూడా తలెత్తినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. డిజిటల్ హక్కుల మార్కెట్ ఈ మధ్య ఉన్నట్లుంది కుప్పకూలింది.
రవితేజ-గోపీచంద్ మలినేని లాంటి క్రేజీ కాంబినేషన్ సినిమా కూడా ఈ కారణంతోనే ఆగిపోయింది. ‘గాంజా శంకర్’కు కూడా అలాంటి సమస్యే తలెత్తినట్లు సమాచారం. సినిమాకు అనుకున్న బడ్జెట్, బిజినెస్ అంచనాలకు పొంతన కుదరట్లేదట. ఇది రిస్కీ ప్రాజెక్ట్ అని నిర్మాత నాగవంశీ భావిస్తున్నారట. బడ్జెట్ తగ్గించుకుని.. టైటిల్, కథలో మార్పులు చేసుకుని ముందుకు వెళ్లడమా.. లేక సినిమానే ఆపేయడమా అని ఆలోచిస్తున్నారట. ‘బ్రో’ తర్వాత శారీరకంగా ఫిట్‌గా తయారయ్యేందుకు, పోస్ట్ యాక్సిడెంట్ కాంప్లికేషన్నింటినీ అధిగమించేందుకు తేజు.. ‘బ్రో’ తర్వాత గ్యాప్ తీసుకున్నాడు. అతను ‘గాంజా శంకర్’పై ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.