రోడ్డు ప్రమాదానికి గురైన సినీ హీరో సాయిధరమ్ తేజ్ ఎపిసోడ్ ఎంతటి హాట్ టాపిక్ గా మారిందన్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఏదైనా నేరం జరిగిన వెంటనే.. దానికి సంబంధించిన వివరాలతో ప్రెస్ నోట్ విడుదల చేయటం పోలీసులకు రివాజు. మరేం అయ్యిందో కానీ.. ప్రమాదం జరిగిన దాదాపు 24 గంటల తర్వాత ప్రమాదానికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలతో కూడిన ప్రెస్ నోట్ ను సైబరాబాద్ పోలీసులు విడుదల చేశారు.
అందులో కొన్ని కీలకాంశాల్ని ప్రస్తావించారు. వాటిని చూసినప్పుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురి కావటానికి ముఖ్యమైన కారణం.. బండిని అతి వేగంతో నడపటమన్న విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అదే సమయంలో.. అతనికి టూ వీలర్ నడిపేందుకు అవసరమైన డ్రైవింగ్ లైసెన్సు ఉందా? లేదా? అన్న విషయాన్ని పోలీసులు తేల్చలేకపోయారు.
వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. అతనికి కారు డ్రైవింగ్ లైసెన్సు ఉంది కానీ.. టూ వీలర్ నడిపేందుకు అవసరమైన డ్రైవింగ్ లైసెన్సు ఉందన్న విషయానికి సంబంధించిన ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. తేజ్ టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్సు గురించి ఆరా తీస్తున్నారు.
ఇదిలా ఉంటే.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద ప్రయాణం చేసిన వేళలో..అతని వాహనం గంటకు 100 కి.మీ. పైనే ప్రయాణిస్తున్నట్లుగా గుర్తించారు. ఇక.. మాదాపూర్ లోని ప్రమాదం జరిగిన రోడ్డు మీద అతను గంటకు 30 కిలోమీటర్ల వేగంలో మాత్రమే ప్రయాణించాల్సి ఉంది. కానీ.. ప్రమాదం జరిగిన సమయంలో అతని వాహన వేగం గంటకు 75 కి.మీ. పైనే ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కారణంతోనే అతనిపై సుమోటోగా కేసులు నమోదు చేసినట్లుగా చెబుతున్నారు.