రష్యా మహిళలకు భారీ నజరానా ప్రకటించారు ఆ దేశ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న వాద్లిమిర్ పుతిన్. గడిచిన కొద్దికాలంగా రష్యాలో రష్యన్ల జనాభా తగ్గుముఖం పట్టింది. దీనికి చెక్ చెప్పేందుకు వీలుగా ఆయనో నజరానాను ప్రకటించారు. దీని ప్రకారం రష్యాలోని మహిళలు ఎవరైనా పది మంది అంతకంటే ఎక్కువ పిల్లల్ని కంటే రష్యన్ కరెన్సీలో మిలియన రూబెల్స్ ఇవ్వటంతోపాటు.. మదర్ హీరోయిన్ అవార్డు ఇస్తామని ప్రకటించినట్లుగా ప్రముఖ మీడియా సంస్థ వాషింగ్టన్ పోస్టు పేర్కొంది.
రష్యా జనాభాను పెంచేందుకు వీలుగా తాజా నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఈ పురస్కారం గతంలో రష్యా విడిపోకముందు.. అంటే.. సోవియెట్ యూనియన్ లో అమలు చేసేవారు. తర్వాతి కాలంలో దాన్నితీసేశారు. జనాభా తగ్గిపోతున్న నేపథ్యంలో మళ్లీ ఈ పురస్కారాన్ని పునరుద్ధరించారు. పది మంది.. అంతకంటే ఎక్కువ పిల్లల్ని కనే మహిళలకు మిలియన్ రూబెల్స్ (రష్యా కరెన్సీ).. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.13 లక్షలకు పైనే ఉంటుంది. ఆ భారీ మొత్తంతో పాటు మదర్ హీరోయిన్ అనే పురస్కారాన్ని కూడా అందిస్తారు. అంతేకాదు..ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తామని చెప్పారు.
కాకుంటే.. ఈ ఆఫర్ ను సొంతం చేసుకోవాలంటే.. 10వ బిడ్డ మొదటి పుట్టిన రోజున ఇస్తామని.. అప్పటికి తొమ్మిది మంది పిల్లల్ని జీవించి ఉండాలని షరతు పెట్టారు. ఇప్పుడీ పురస్కారం రష్యా వ్యాప్తంగా పెను చర్చగా మారింది. ఆధునిక ప్రపంచంలో పది మంది పిల్లల్ని కనే మహిళలు ఉన్నారా? ఒకవేళ అలా చేసేందుకు సిద్ధమైతే.. వారికి ఇచ్చే రూ.13లక్షలు (మిలియన్ రూబుల్స్) చాలా తక్కువ మొత్తంగా చెప్పక తప్పదు.
Comments 1