చేతకానమ్మ చేతకానట్లుగా ఉండటంలో ఉన్న సుఖం అంతా ఇంతా కాదు. అందుకు భిన్నంగా ఏదో పొడిచేస్తామంటూ వ్యాఖ్యలు చేసి.. యద్ధానికి వెళ్లటం ఎందుకు? ప్రత్యర్థి దేశం కొట్టే దెబ్బలకు ఠారెత్తిపోయి.. ఇప్పుడు శరణు అన్న రీతిలో కొత్త కమిట్ మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? అన్న భావన కలుగక మానదు.
నాటో కూటమితో చేతులు కలిపేందుకు సిద్ధం కావటం.. దీనిపై రష్యా చేసిన హెచ్చరికల్ని పట్టించుకోకుండా యుద్ధానికి సై అన్న ఉక్రెయిన్ సంగతి తెలిసిందే.
సైనిక చర్య పేరుతో దాదాపు రెండు వారాల పాటు సాగిన యుద్ధంతో యావత్ ప్రపంచమంతా ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా ప్రభావితమైందన్న సంగతి తెలిసిందే. రష్యా చేస్తున్న దాడిలో ఉక్రెయిన్ తీవ్ర నష్టానికి గురి కావటం.. యుద్ధ శకలాలతో ఆ దేశరాజధానితో సహా పలు నగరాల్లో పట్టణాలు దారుణ నష్టానికి గురయ్యాయి. ప్రజలు పెద్దఎత్తున పక్కనున్న దేశాలకు వలసపోయిన పరిస్థితి.
ఉక్రెయిన్ – రష్యాల మధ్య మొదలైన యుద్ధం అంతకంతకూ ఎక్కువ అవుతున్న పరిస్థితుల్లో అమెరికా సైతం ఉక్రెయిన్ కుముందు చెప్పిన మాటలకు భిన్నంగా వ్యవహరించటం షురూ చేసింది. నాటో దేశాలు ఆయుధాలు..యుద్ధ విమానాల కంటే కూడా రష్యాను ఆర్థికంగా ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేశాయి.
పలు ప్రముఖ అమెరికన్ కంపెనీలు తీసుకున్న నిర్ణయాలు పుతిన్ సర్కారుకు ఇబ్బంది కలిగించినప్పటికి.. ఉక్రెయిన్ మీద యుద్ధం ఆపే పరిస్థితి లేకుండా పోయింది. దాడుల తీవ్రత పెరిగే కొద్దీ ఉక్రెయిన్ పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పుడు జరిగిన యుద్ధం పుణ్యమా అని.. మళ్లీ కోలుకోవటానికి కనీసం ఇరవై.. పాతికేళ్ల సమయం తీసుకుంటుందని చెబుతున్నారు.
ఇలాంటి వేళ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. తాము నాటో సభ్యత్వాన్ని కోరబోమని స్పష్టం చేశారు. అంతేకాదు.. రష్యా అనుకూల ప్రాంతాల హోదాపై రాజీ పడేందుకు సిద్ధమేనని తెలిపారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఉక్రెయిన్ ను అంగీకరించటానికి నాటో సిద్ధంగా లేదని.. తనకు ఈ విషయం అర్థమైన తర్వాత తాను వెనక్కి తగ్గినట్లుగా ప్రకటించారు. వివాదాస్పద అంవాల మీదా.. రష్యాను ఎదుర్కొనే అంశం మీదా నాటో కూటమి ఎదుర్కోవటానికి భయపడుతోందన్నారు.
అందుకే నాటోలో చేరే విషయంలో తన తాజా ఆలోచనల్ని చెబుతూ.. వారి ముందు మోకరిల్లి బిచ్చమెత్తుకునే దేశానికి అధ్యక్షునిగా తాను ఉండలనుకోవటం లేదన్నారు. ఒకవేళ ఇదే అంశంపై ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఇప్పుడు వచ్చిన అవగాహన రెండు వారాల క్రితమే వచ్చి ఉంటే.. యుద్ధం కూడా వచ్చేది కాదు.
ఇప్పుడు జరిగినంత నష్టం కూడా జరిగేది కాదు. యుద్ధానికి ముందు నాటో తో జట్టు కడతామని ఉక్రెయిన్ చెప్పటం.. అందుకు రష్యా అభ్యంతరం వ్యక్తం చేయటం తెలిసిందే. ఉక్రెయిన్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని రష్యా హెచ్చరించినప్పటికి తన తీరును మార్చుకోలేదు.
ఇవాల్టి రోజున మాత్రం అందుకు భిన్నంగా తన నిర్ణయాన్ని మార్చుకోవటం చూసినప్పుడు.. ఇదే బుద్ధి యుద్ధానికి ముందు ఉండి ఉంటే.. వేలాది మంది ప్రాణాలతో పాటు.. లక్షలాది కోట్ల రూపాయిల ఆస్తుల ధ్వంసం చోటు చేసుకునేది కాదు కదా? అప్పుడు లేని తెలివి ఇప్పుడే ఎందుకు వచ్చినట్లు? అన్నది అసలు ప్రశ్న.