ఏపీలోని బాపట్ల జిల్లాలో జాతీయ రహదారిపై వైమానిక విమానాలు ల్యాండ్ కానున్నాయి.
ఈ మేరకు అందుకు ట్రయల్స్ నిర్వహించారు. బాపట్ల జిల్లాలోని కొరిశపాడు మండలం పిచ్చికల గుడిపాడు వద్ద జాతీయ రహదారిపై వైమానిక విమానాలు ల్యాండింగ్ ట్రయల్ చేశాయి.
ఎమర్జెన్సీ రన్వే పై ఏర్పాటు చేసిన ట్రయల్ రన్ ను వైమానిక దళ అధికారులు సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు.
వైమానిక దళానికి చెందిన ఎయిర్ 31 ట్రాన్స్ పోర్ట్ కార్గో, సూపర్ 30 జెట్ ఫైటర్స్, తేజస్ లైట్ విమానాలు ట్రయల్ రన్ లో పాల్గొన్నాయి.
రన్వే పై తక్కువ ఎత్తులో ఎగురుతూ పైలెట్లు రన్ వేని పరీక్షించారు.
భవిష్యత్తులో ఎప్పుడైనా అత్యవసర పరిస్థితులలో ఇక్కడి హైవేపై విమానాలు దిగేందుకు అనుకూలమేనని ఈ ట్రయల్ రన్లో తేల్చారు.
మిగతా పనులను త్వరలోనే పూర్తి చేసుకుని వచ్చే ఏడాది మే, జూన్ నెలల్లో… రన్వే పై పూర్తిస్థాయిలో విమానాలను దించేందుకు చర్యలు చేపడుతున్నామని వైమానిక దళ అధికారులు తెలిపారు.
కాగా ఉదయం నుంచి వైమానిక దళాల విమానాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో అక్కడ హడావుడి వాతావరణం నెలకొంది.
కొన్నిఅభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి నిర్మాణాలు సాధారణమే అయినా ఇటీవల కాలంలో భారత్ లో కూడా ప్రభుత్వం ఇటువంటి ఏర్పాట్లు చేస్తోంది.
ఉత్తరాదిలో, సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటి నిర్మాణాలు చేపట్టగా తాజాగా ఏపీ లోని కొరిశపాడులో ఎయిర్ పాడ్ ను తీర్చిదిద్దారు. ఈ ట్రయల్ రన్ తరువాత ఈ హైవే పూర్తి స్థాయిలో రన్ వేగా మారనుంది.
ఈ హైవేపై రన్ వేని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
దేశంలో మొత్తం 28 చోట్ల హైవేలపై విమానాలు దిగే ఏర్పాట్లు చేస్తోంది మోదీ ప్రభుత్వం.