జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు నెలకొన్నట్లుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా ప్రచారాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన్ని రకరకాల ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు వెంటాడినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కడప జిల్లాలో జరిగిన రైతు భరోసా యాత్ర సందర్భంగా కొందరు అపరిచిత వ్యక్తులు ఆ సమావేశంలో అలజడి రేపే ప్రయత్నం చేసినట్లు, అలాగే పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కారులో కొందరు రెక్కీ నిర్వహించినట్లు కొంచెం గట్టిగానే ప్రచారం సాగుతోంది.
ఇవి ఆషామాషీ ఊహాగానాలేమీ కాదని.. పవన్‌కు వ్యతిరేకంగా ఏదో కుట్ర జరుగుతున్న మాట వాస్తవమని జనసేన వర్గాలు బలంగా వాదిస్తున్నాయి. వాళ్లు ఒక సుపారీ కిల్లింగ్ థియరీని కూడా తెరపైకి తేవడం గమనార్హం. పవన్‌ను అంతమొందించడానికి రూ.250 కోట్ల మొత్తానికి ఒప్పందం జరిగినట్లుగా సోషల్ మీడియాలో తిరుగుతున్న ఒక నోట్ ఇప్పుడు సంచలనం రేపుతోంది.
ఈ నోట్లో పేర్కొన్న ప్రకారం జనసేనానిని హత్య చేసేందుకు గాను రూ.250 కోట్లు చేతులు మారినట్లుగా కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయట. వేరే కేసుకు సంబంధించి ఫ్యాన్ ట్యాపింగ్ జరపగా.. పవన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర గురించి నిఘా వర్గాలకు సంచలన విషయాలు తెలిసినట్లుగా ఈ నోట్లో పేర్కొన్నారు. సుపారీగా పేర్కొన్న రూ.250 కోట్ల నిధులు సమకూర్చడానికి కొందరు ఎన్నారైలు ముందుకు వచ్చారని.. ఒక క్లోజ్ గ్రూప్ మీటింగ్‌లో భాగంగా ఒక నాయకుడు ‘‘అన్నా అణ్ని చంపేయడండన్నా. అతణ్ని భరించలేకపోతున్నాం’’ అని పవన్‌ను ఉద్దేశించి అన్నట్లుగా కూడా చెబుతున్నారు.
ఈ సంభాషణలు విన్న నిఘా వర్గాలు ఈ కుట్ర మీద సీరియస్‌గా దృష్టిసారించాయని.. రాష్ట్ర ఇంటలిజెన్స్ వర్గాలకు కూడా ఈ విషయాన్ని కమ్యూనికేట్ చేశాయని.. వాళ్లకు కూడా విషయం తెలిసినప్పటికీ ఈ విషయం తెలిసీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ సుపారీ విషయం ఎంత వరకు నిజమో.. దీని వెనుక ఎవరున్నారో ఏమిటో తెలియాల్సి ఉంది.