తిరుపతి లో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తొక్కిసలాట ఘటన జరిగి ఆరుగురు భక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేపథ్యంలోనే ఆ ఘటనలో గాయపడ్డ 41 మందిని పరామర్శించేందుకు చంద్రబాబు తిరుపతిలో నేడు పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే ఆ ఘటనలో మరణించిన ఒక్కో వ్యక్తి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారాన్ని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకారం మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటన విడుదల చేశారు.
ఆ ఘటనలో గాయపడి తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న భక్తులను చంద్రబాబు పరామర్శించనున్నారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ఆయన పరిహారం ప్రకటిస్తారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భారీ సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసీ తగిన ఏర్పాట్లు ఎందుకు చేయలేదని అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.
ఈ ఘటనపై టీటీడీ ఈవో శ్యామల రావు స్పందించారు. ఒక డీఎస్పీ ఒక్కసారిగా గేట్లు తెరవడం వల్ల తొక్కిసలాట ఘటన జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామని శ్యామలరావు అన్నారు.
తొక్కిసలాట ఘటన దురదృష్టకమని, ఘటనకు గల కారణాలపై విచారణ జరుగుతోందని చెప్పారు. ప్రాథమిక చికిత్స తర్వాత కొందరిని డిశ్చార్జి చేశారని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు. ఇద్దరికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయని, వారికి మెరుగైన చికిత్స అందుతోందని చెప్పారు.