జగన్ సర్కార్ కు ఈ మధ్యకాలంలో కోర్టుల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్న సంగతి తెలిసిందే. జగన్, విజయసాయిల బెయిల్ రద్దు పిటిషన్ లో మినహా మిగతా కేసులన్నింటిలోనూ జగన్, ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురవుతూనే ఉంది. ఇప్పటికే చాలా సార్లు హైకోర్టు, సుప్రీం కోర్టుల ఆగ్రహానికి గురైన ఏపీ ప్రభుత్వానికి తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. దేవీ సీఫుడ్స్ లిమిటెడ్ కేసులో జగన్ సర్కార్ కు సుప్రీంకోర్టు షాకిచ్చింది.
ఈ కేసులో హైకోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు గాను ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు రూ.లక్ష జరిమానా విధించింది. ఈ కేసు విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన దేశపు అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయనందుకుగాను ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వానికి రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
ఈ మధ్య కాలంలో జగన్, ఏపీ ప్రభుత్వానికి కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావడం సర్వసాధారణం అయిపోయింది. దేశంలో ఇప్పటి వరకు మరే ప్రభుత్వానికి కోర్టులో తగలనన్ని ఎదురు దెబ్బలు ఏపీ ప్రభుత్వానికి తగులుతుండడం చర్చనీయాంశమైంది. జగన్ సీఎం అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఏదో ఒక కేసులో కోర్టు నుంచి షాక్ లు తప్పడం లేదు. ఇటీవల జగన్, విజయసాయిల బెయిల్ కొనసాగించే అంశం మినహా దాదాపు అన్ని కీలక కేసుల్లోనూ ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగలడం విశేషం. మరి, ఈ ఎదురు దెబ్బల నుంచి జగన్, వైసీపీ నేతలు గుణపాఠాలు నేర్చుకొని మరింత అప్రమత్తంగా ఉంటారా లేక ఇలాగే కోర్టుల చేత మొట్టికాయలు వేయించుకుంటూ ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.