అభిమానం ఉండాలి
స్థాయి దాటకూడదు
గౌరవం పెంచుకునే తీరులోనే ఉండాలి
యుద్ధాలకు తావివ్వకూడదు
ఇద్దరు అగ్ర కథానాయకుల అభిమానులు
హుందాగా ఉండాలి కానీ స్టేషన్ల చుట్టూ తిరగకూడదు
సింపుల్ గా చెప్పాలంటే …గొడవలొద్దు బ్రదర్
అంతా ఊహించిన విధంగానే కొన్ని వర్గాలు కొత్త యుద్ధాలకు తెరలేపుతున్నాయి. చాలా కాలం కిందట నడిచిన అభిమాన సంఘాల మధ్య కొట్లాటలు తరువాత ఆగిపోయాయి కానీ ఇప్పుడు మళ్లీ అవే వెలుగు చూస్తున్నాయి. ఎందుకనో ఇరు వర్గాలూ తమ మాటే నెగ్గితే చాలు అన్న పంతంలో ఉంటున్నాయి.
దీంతో మరిన్ని అభిమాన సంఘాలు పుట్టుకు వచ్చి దీన్నే అదునుగా తీసుకుని అలజడులు సృష్టించే అవకాశాలు కూడా ఉన్నాయి అని నిఘా వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే జిల్లాలలో పలు చోట్ల సామాజిక కార్యక్రమాలను పోటాపోటీగా నిర్వహిస్తున్నారు ఎన్టీఆర్ మరియు చరణ్ అభిమానులు.
ఓ విధంగా ఇలాంటి పరిణామాలు ఆహ్వానించదగ్గవే కానీ ఇదే అదునుగా సోషల్ మీడియాలో వార్ నడిపించడం మాత్రం ఆక్షేపణీయం. అభ్యంతరకరం కూడా! కొన్ని చోట్ల టిక్కెట్ల కోసమే అభిమాన సంఘాలు పుట్టుకువస్తున్నాయా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. మొదటి రోజు టికెట్ ధర ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు పలుకుతోంది.
అభిమాన సంఘాల వెనుక ఉన్న రాజకీయ నాయకుల పుణ్యమాని బ్లాక్ దందా బాగానే నడుస్తుందని కొన్ని నిఘా వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి కూడా! టికెట్ అమ్మకాల్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తో పాటు అభిమాన సంఘాల జులుం కూడా తీవ్రంగానే ఉంటోంది. ఫ్లెక్సీల పేరిట హంగామా చేసేది కూడా కొన్ని చోట్ల వాటి పేరిట వివాదాలు నడుపుతున్నది కూడా టిక్కెట్ల కోసమే అన్నది నిర్వివాదాంశం.
ఈ దశలో సినిమా హిట్టై అనూహ్య రీతిలో ఫలితాలు ఉంటే పైరసీ భూతం ఒకటి సినిమా వర్గాలను వెన్నాడడం ఖాయం. పోనీ దీనిని ఫ్యాన్స్ నిలువరించగలరా అంటే అది సాధ్యం కాని పని. బాహుబలి సమయంలో కూడా పైరసీని అడ్డుకోలేక అభిమానులు నానా తంటాలూ పడ్డారు.
దీంతో ఇవాళ థియేటర్ల దగ్గర రెండు గ్రూపులుగా ఏర్పడి కొట్టుకుంటున్న ఏ వర్గం కూడా సినిమా పైరసీని ఆపగలిగితే, థియేటర్లలో మొబైల్ క్యాప్చూరింగ్ ను ఆపగలిగితే అప్పుడు వాళ్లు రియల్ హీరోలు అని అనిపించుకోవడం ఖాయం. కానీ ఇవేవీ లేకుండా అనవసర హంగామా చేయడం అన్నది అటు నందమూరి అభిమానులకు కానీ ఇటు మెగా అభిమానులకు కానీ తగని పని!
ఈ దశలో విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎక్కడ చూసినా అభిమనుల సందోహం కనిపిస్తోంది.కొన్ని చోట్ల వివాదాలు నడుస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల థియేటర్ల దగ్గర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తం అయి ఇరు వర్గాలనూ నిలువరిస్తున్నారు.
కొన్ని సార్లు తప్పనిసరై లాఠీ ఛార్జీ చేస్తున్నారు. కొందరిని అదుపులోకి తీసుకుని సమీప పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. అయినా కూడా వివాదాలు ఎక్కడా తగ్గడం లేదు. ఇరు హీరోల అభిమానులూ పంతాలకు పోతూ వాగ్యుద్ధాలకు తావిస్తున్నారు. తాజాగా ఒంగోలులో ఓ థియేటర్ వద్ద తారక్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.