టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ‘మహా రాజ’మౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. విడుదలైన తొలి రోజు నుంచే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోన్న ఈ చిత్రం మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ల నట విశ్వరూపానికి బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులు…ఈ సినిమాను తాజాగా వెయ్యి కోట్ల క్లబ్ లో చేర్చారు.
ఇద్దరు స్టార్ హీరోలతో జక్కన్న మలిచిన ఈ భారీ మల్టీస్టారర్ మరో బాహుబలి రేంజ్ లో రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్లను వసూలు చేసి రూ.1500 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతోంది. భారతదేశ చలనచిత్ర చరిత్రలో రూ.1,000 కోట్లు వసూలు చేసిన మూడో చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. దంగల్, బాహుబలి 2 ల తర్వాత వెయ్యి కోట్లు కొల్లగొట్టిన సినిమా ఇదేనని ఫిల్మ్ అండ్ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ ప్రకటించారు.
అయితే, వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన మూడు చిత్రాల్లో రెండు రాజమౌళివే ఉండడం విశేషం. పకడ్బందీ స్క్రీన్ ప్లేతో తన సినిమాకు కమర్షియల్ సక్సెస్ తీసుకురాగల రాజమౌళి నైపుణ్యానికి ఈ హిట్ సినిమాలే నిదర్శనమని చెప్పుకోవాలి. నిర్మాత డీవీవీ దానయ్య రూ.450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన 16 రోజుల్లోనే భారీ కలెక్షన్లు వసూలు చేసి వెయ్యి కోట్ల క్లబ్ లో చేరింది.
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళికి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. స్టూడెంట్ నెం.1తో మొదలుకొని ఆర్ఆర్ఆర్ వరకు ప్లాప్ అంటూ లేకుండా వరుస హిట్ లతో దూసుకుపోతున్న రాజమౌళి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. రాఘవేంద్రరావు శిష్యుడిగా చెప్పుకునే రాజమౌళి…తన ప్రతి విజయం వెనుక తండ్రి వి.విజయేంద్ర ప్రసాద్ ఉన్నారని చెబుతుంటారు. తన తండ్రి అందించిన కథలకు అద్భుతంగా తెరకెక్కించే రాజమౌళి….ఆర్ఆర్ఆర్ తో మరోసారి తమ కాంబినేషన్ ఎంత సక్సెస్ ఫుల్లో చెప్పేశారు. ఇక, ఆర్ఆర్ఆర్ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని విజయేంద్ర ప్రసాద్ ప్రకటించడంతో…వెయ్యి కోట్ల క్లబ్ లో ఆ సినిమాతో జక్కన్న హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.