ఇప్పుడు అందరి నోట ‘ఆర్ఆర్ఆర్’ మూవీ గురించి ముచ్చటే. ఏ ఇద్దరు కలిసినా.. వారి మాటల్లో ఆర్ఆర్ఆర్ మూవీ గురించి అంతో ఇంతో మాట్లాడుకుండా ఉండలేని పరిస్థితి. చిత్ర పరిశ్రమ రికార్డుల్ని బద్ధలు కొట్టేస్తూ.. విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ సినిమా గురించి మాట్లాడుకునే వారు దర్శకుడు రాజమౌళి.. హీరోలు తారక్.. రాంచరణ్ లతో పాటు చిన్నారి మల్లి (సినిమాలో పాత్ర పేరు) గురించి మాట్లాడకుండా ఉండలేరు. నిజానికి సినిమా మొదలయ్యేదే మల్లితోనే. సినిమా మొత్తం నడిచేదే మల్లి పాత్ర చుట్టూనే.
‘అమ్మా.. యాదికొస్తాంది’ అంటూ మల్లి నోటి నుంచి వచ్చే డైలాగ్.. థియేటర్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడి గుండెను టచ్ చేస్తుంది. అంతలా కట్టిపడేసేలా నటించిన ఈ చిన్నారి ఆర్టిస్టు ఎవరు? ఎక్కడమ్మాయి? చూసినంతనే గిరిజన బాలికలా.. అచ్చుగుద్దినట్లు తెలుగు అమ్మాయిలా ఉన్న ఈ చిట్టి ఆర్టిస్టు గురించి వివరాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతకీ మల్లిని దర్శకుడు రాజమౌళి ఎలా ఎంపిక చేశారన్నది కూడా ఆసక్తికరంగా అనిపించక మానదు.
గిరిజన బిడ్డ మల్లిని బ్రిటీష్ దొరసాని తీసుకెళ్లిపోవటంతో సినిమా స్టార్ట్ కావటం.. ఆమెను గూడెంకు తీసుకురావటం కోసం తారక్ బయలుదేరి వెల్లటం తెలిసిందే. ఈ చిన్ని ఆర్టిస్టు పేరు ట్వింకిల్ శర్మ. తనది చండీగఢ్. డాన్స్ ఇండియా డాన్స్ రియాలిటీ షోతో గుర్తింపు పొందిన ఈ చిట్టి ఆర్టిస్టు.. పలు టవీ యాడ్స్ లో పని చేసింది.
ఫ్లిప్ కార్ట్ యాడ్ లో ఈమెను చూసిన రాజమౌళి.. తనకు కావాల్సిన మల్లి కనిపించేసిందనుకోవటం.. ఆమెను పిలిపించి ఆడిషన్ చేయించటం.. అందులో ఆమె పాస్ కావటంతో.. ఆర్ఆర్ఆర్ లో కీలక పాత్రలో భాగమైంది.
మూవీలో మల్లి నోటి నుంచి వచ్చే.. నన్ను ఈడ ఇడిసిపోకన్న అమ్మా.. యాదికొస్తాందన్న డైలాగ్ ప్రేక్షకుల్ని ఇట్టే టచ్ చేయటం తెలిసిందే. తనకొచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని.. మంచి మార్కులు కొట్టేసిన ఈ చిట్టితల్లికి రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుందాం. ట్వింకిల్ శర్మకు ఆల్ ద బెస్టు చెప్పేద్దామా?