తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక ఎంఎల్ఏపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేయడం ఇదే మొదటిసారి. ఎంఎల్ఏలు, మంత్రులపై అనేక అవినీతి ఆరోపణలు, కేసులు నమోదవుతుంటాయి. అలాగే రకరకాల కేసులు కూడా నమోదవ్వటం చాలా సహజమే. కానీ పీడీ (ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్)యాక్ట్ నమోదవ్వడం మాత్రం ఇదే మొదటిసారి. ఎవరైనా వ్యక్తుల వల్ల సమాజానికి హాని జరుగుతుందని అనుకున్నా, ఉద్దేశ్యపూర్వకంగా వివిధ వర్గాల మధ్య ఘర్షణలకు కారకుడవుతున్నారని పోలీసులు భావిస్తే వెంటనే పీడీ యాక్ట్ నమోదు చేస్తారు.
ఈ యాక్ట్ పెడితే బెయిల్ కూడా అంతతొందరగా రాదు. ఇలాంటి యాక్టును రాజాసింగ్ మీద పోలీసులు నమోదు చేశారు. స్టాండప్ కామెడీ పేరుతో మునావర్ ఫారూకీ హైదరాబాద్ లో షో చేశారనే అక్కసుతోనే ఎంఎల్ఏ మహ్మద్ ప్రవక్తపై నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. అంటే మునావర్ షో ను సజావుగా జరగటానికి కారకులైన ప్రభుత్వం లేదా పోలీసులపైన పెరిగిపోయిన అక్కసును రాజాసింగ్ మహ్మద్ ప్రవక్త పైన చూపించారని అర్ధమైపోతోంది.
ఎప్పుడైతే రాజాసింగ్ వీడియో విడుదల చేశారో అప్పటినుండే పాతబస్తీ తో పాటు ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో గొడవలు పెరిగిపోయాయి. ఒకవైపు బీజేపీ+రాజాసింగ్ మద్దతుదారులు, మరోవైపు ముస్లింల మధ్య గొడవలు పెరిగిపోయాయి. ఈ కారణంతోనే ఎంఎల్ఏపైన పీడీ యాక్ట్ ఓపెన్ చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 2004 నుండి ఎంఎల్ఏ మీద 101 క్రిమినల్ కేసులు నమోదయ్యున్నాయి. వీటిల్లో 18 కేసులు మతపరమైన కేసులే కావటం గమనార్హం.
అంటే మతాల మధ్య చిచ్చు పెట్టడం ఎంఎల్ఏకి కొత్తేమి కాదని అర్ధమైపోతోంది. మరింత కాలం రాజాసింగ్ పై పోలీసులు ఎందుకని పీడీ యాక్టు పెట్టలేదో అర్ధం కావటం లేదు. ఎంఎల్ఏ చేసిన పనికి చివరకు బీజేపీ అగ్రనేతలు కూడా సమర్ధించే పరిస్ధితి లేకపోయింది. మరి పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్టును సవాలు చేస్తు ఎంఎల్ఏ కోర్టులో పిటీషన్ దాఖలు చేస్తారని అంటున్నారు. వీడియో, ఆడియో సాక్ష్యాలున్నపుడు కోర్టు మాత్రం ఏమి చేయగలుగుతుంది ?