కోడి ముందా?…గుడ్డు ముందా? ఈ ప్రశ్నపై చర్చ మొదలుపెడితే…గంటల తరబడి వాదోపవాదాలు, పిడివాదాలు, శాస్త్రపరమైన వాదనలు ఎన్నో తెరముందుకు వస్తాయి. గుడ్డు ముందని వాదించే వర్గం, కోడే ముందని వాదించే వర్గం…ఎవరి వెర్షన్ లో వారు తమ వాదనలు సమర్థించుకుంటూనే ఉంటారు. అయితే, ఏపీలో తాజాగా జరిగిన ఓ వింత ఘటన చూశాక ఈ ప్రశ్నకు బదులు కోడికి సంబంధించిన మరో ప్రశ్నపై చర్చ మొదలైంది.
కోడిపుంజు కూడా గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతుందా? అవును నిజమే. ఏదో టైపింగ్ చేస్తూ పొరపాటున కోడి పెట్టకు బదులు కోడి పుంజు అని టైప్ చేశారనుకుంటే మీరు కోడిగుడ్డు మీద కాలేసినట్టే. నిజంగానే చిత్తూరు జిల్లాలోని తొట్టంబేడు మండలంలోని పెద్దకన్నలి ఎస్టీ కాలనీలో ఓ కోడిపుంజు 5 గుడ్లు పెట్టింది. అంతేకాదు, ఎంచక్కా ఆ గుడ్లను పొదిగి కోడి పిల్లలకు కూడా జన్మనిచ్చింది. దీంతో, ఇదేం చోద్యం అంటూ జనం నోరెళ్లబెడుతున్నారు. ఆనోట..ఈనోట పడి ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తొట్టంబేడులోని సుబ్రహ్మణ్యం రెడ్డి తన ఇంట్లో 4 కోళ్లతో పాటు ఒక పుంజును పెంచుకుంటున్నాడు. ఓ రోజు తన కోడిపుంజు 5 గుడ్లు పెట్టడంతో సుబ్రహ్మణ్యం రెడ్డి అవాక్కయ్యాడు. అయితే, ఆ గుడ్లు తీసుకెళ్లి పుంజు కిందపెడితే పొదుగుతుందా లేదో అని ఆయన టెస్ట్ చేశారడు. ఆశ్చర్యకరంగా ఆ పుంజు…5 పిల్లలను పెట్టలాగే పొదిగింది. అంతేకాదు, ఆ పుంజు తన పిల్లలను పెట్టలాగే కంటికి రెప్పలా కాపాడుకుంటున్న వైనం చూసేందుకు గ్రామస్థులు తండోపతండాలుగా ఆ ఇంటికి వస్తున్నారట. అయితే, జన్యుపరమైన కారణాల వల్ల ఇలా అరుదుగా జరుగుతుందని వెటర్నరీ అధికారి వీరభద్రరెడ్డి వివరణ ఇచ్చారు.