విశాఖలో నేడు వైసీపీ గర్జన, రోజా ప్రసంగం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ పరోక్ష మద్దతుతో చేపట్టిన విశాఖ గర్జన, అదే సమయంలో పవన్ చేపట్టిన ఉత్తరాంధ్ర నేపథ్యంలో విశాఖ తీరం జనసేన, వైసీపీ కార్యకర్తలతో పోటెత్తింది. ఈ క్రమంలోనే విశాఖ గర్జనకు హాజరై తిరిగి వెళుతున్న సమయంలో వైసీపీ కీలక నేత, టీటీడీ చైర్మర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేశ్ కార్లపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డ వైనం సంచలనం రేపుతోంది.
ఈ దాడిలో సుబ్బారెడ్డితో పాటు మంత్రులు రోజా, జోగి రమేశ్ కార్ల అద్దాలు ధ్వంసం కావడం దుమారం రేపింది. ఈ ఘటనలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. విశాఖ ఎయిర్‌పోర్టుకు వారు బయలుదేరడం..అదే సమయంలో పవన్ ఎయిర్ పోర్టుకు రావడంతో వైసీపీ, జనసేన కార్యకర్తలతో ఎయిర్ పోర్టు దగ్గర భారీ జనసందోహం ఏర్పడింది. పవన్‌కు స్వాగతం పలికేందుకు జన సైనికులు భారీ సంఖ్యలో ఎయిర్ పోర్టుకు చేరుకున్న సమయంలో వైసీపీ నేతల కార్లు కనిపించాయి.
దీంతో, కర్రలు, రాళ్లు చేతబట్టిన జనసైనికులు వైసీపీ మంత్రులు, వైవీ కార్లపై దాడికి దిగారు. ఈ దాడితో విశాఖలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ క్రమంలోనే ఈ దాడి ఘటనపై మంత్రి జోగి రమేశ్ స్పందించారు. ఈ తరహా దాడులు ప్రజాస్వామ్యంలో సరైనవి కావని ఆయన అన్నారు. జనసేన శ్రేణులు చిల్లర యవ్వారాలకు పాల్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐదారు జిల్లాల నుంచి జనసేన కార్యకర్తలను విశాఖకు పవన్ తరలించారని, మద్యం మత్తులో ఉన్న వారంతా తమపై దాడులకు పాల్పడ్దారని ఆరోపించారు. చిల్లర గాళ్లను పిలిపించుకుని అరాచకవాదులుగా మార్చేందుకు పవన్ యత్నిస్తున్నారని మండిపడ్డారు. పవన్ తన అనుచరులను అదుపులో పెట్టుకోవాలని, లేనిపక్షంలో వైసీపీ శ్రేణులు తలచుకుంటే పవన్ ఎక్కడ కూడా తిరగలేరని జోగి రమేశ్ హెచ్చరించారు.