నగరి వైసీపీ ఎంఎల్ఏ రోజా ఏదో కారణంగా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రోజా మరోసారి వార్తల్లో నిలిచారు. నగరి మున్సిపల్ వార్డుల్లో అధికారపార్టీ అభ్యర్ధులకు పోటీగా కొందరు రెబల్సును నిలబెట్టారంటూ ఆరోపించారు. వైసీపీ అధికారికంగా ప్రకటించిన అభ్యర్ధులను ఓడించేందుకు కొందరు సీనియర్ నేతలే రెబల్సును కావాలని పోటీలోకి దింపినట్లు రోజా మండిపోయారుదాంతో సహజంగానే మీడియా ఆమె ఆరోపణలకు బాగా ప్రాముఖ్యత ఇచ్చింది.
ఫలితాలు వచ్చిన తర్వాత రెబల్సును పోటీలోకి దింపిన సీనియర్ నేతల బండారమంతా బయటపెడతానని, సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తానంటూ రోజా హెచ్చరించారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో కూడా తనను ఓడించేందుకు ప్రయత్నం చేశారంటూ గుర్తుచేశారు. అప్పుడు ఎంతమంది ఎన్నిరకాలుగా ప్రయత్నించినా తాను గెలిచినట్లే ఇపుడు కూడా పార్టీ అభ్యర్ధులే గెలుస్తారంటూ సవాలు విసిరారు.
రోజా చేసిన ఆరోపణలు, ఎవరిని ఉద్దేశించి ఇదంతా మాట్లాడుతున్నారనే విషయం బహిరంగ రహస్యమే. పార్టీలో రోజాకు నగిరిలోనే ఉన్న కేజే కుమార్, శాంతి దంపతులకు పడటంలేదు. వీళ్ళకు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నూరుశాతం మద్దతిస్తున్నట్లు రోజా బలంగా అనుమానిస్తున్నారు. అనుమానాలే కాకుండా బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
అంతా బాగానే ఉంది కానీ బహిరంగంగా ఆరోపణలు చేయటం ద్వారా రోజా ఏమి ఆశిస్తున్నారో అర్థం కావటంలేదు. ఎవరిమీదైనా ఫిర్యాదులు చేయాల్సొస్తే అది నేరుగా జగన్ ను కలిసి మాట్లాడేంత స్వేచ్ఛ రోజాకుంది. ఆ అవకాశాన్ని వదిలిపెట్టి మీడియా ముందు బహిరంగంగా ఆరోపణలు చేయాల్సిన అవసరం రోజాకు ఏమొచ్చిందో అర్థం కావటంలేదు. మొన్నటికి మొన్న ప్రివిలేజ్ కమిటీ ముందు రోజా జిల్లా కలెక్టర్ తదితరులు తనను లెక్క చేయడం లేదని ఫిర్యాదులు చేయటం, భోరున ఏడ్వటం అందరికీ తెలిసిందే. మరి దేనికోసం రోజా ఇదంతా చేస్తున్నారో అర్ధం కావటంలేదు.